Telugu Global
National

పుట్టినరోజు ధ్రువీకరణకు ఆధార్‌ చెల్లదు.. - ఈపీఎఫ్‌ఓ కీలక నిర్ణయం

ఇటీవల పలు కేసుల్లో న్యాయస్థానాలు ఆధార్‌ కార్డును బర్త్‌ సర్టిఫికెట్‌గా గుర్తించలేమని తమ తీర్పుల్లో స్పష్టం చేశాయి. దీంతో ఆధార్‌ ప్రామాణికంగా పుట్టిన తేదీలో మార్పులు చేయలేమని ఈపీఎఫ్‌వో తేల్చిచెప్పింది.

పుట్టినరోజు ధ్రువీకరణకు ఆధార్‌ చెల్లదు.. - ఈపీఎఫ్‌ఓ కీలక నిర్ణయం
X

ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) కీలక నిర్ణయం తీసుకుంది. దానికి సెంట్రల్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ కమిషనర్‌ గురువారం ఆమోదం కూడా తెలిపారు. ఇంతకీ ఆ నిర్ణయం ఏమిటంటే.. ఈపీఎఫ్‌ఓకి ఖాతాదారులు జనన ధ్రువీకరణ కోసం సమర్పించే పత్రాల జాబితా నుంచి ఆధార్‌ కార్డును తొలగించింది. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ఇకపై ఆధార్‌ కార్డును ప్రాథమిక గుర్తింపు ధ్రువీకరణ పత్రంగా మాత్రమే పరిగణించాలని, జనన ధ్రువీకరణకు ప్రామాణికం కాదని ఈపీఎఫ్‌వో స్పష్టం చేసింది. ఈ మేరకు ఈనెల 16న ఉత్తర్వులు కూడా విడుదల చేసింది. దానికి సెంట్రల్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ కమిషనర్‌ గురువారం ఆమోదం తెలిపారు.

ఇటీవల పలు కేసుల్లో న్యాయస్థానాలు ఆధార్‌ కార్డును బర్త్‌ సర్టిఫికెట్‌గా గుర్తించలేమని తమ తీర్పుల్లో స్పష్టం చేశాయి. దీంతో ఆధార్‌ ప్రామాణికంగా పుట్టిన తేదీలో మార్పులు చేయలేమని ఈపీఎఫ్‌వో తేల్చిచెప్పింది. ఇకపై ఖాతాదారులు జనన ధ్రువీకరణ కోసం ఈ కింది పత్రాలను సమర్పించవచ్చని తెలిపింది.

అవేంటంటే..

1. జనన ధ్రువీకరణ పత్రం (జనన, మరణాల విభాగం రిజిస్ట్రార్‌ జారీ చేసేది)

2. ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా బోర్డు లేదా విశ్వవిద్యాలయం జారీ చేసే మార్కుల జాబితా

3. పాఠశాల బదిలీ (టీసీ) లేదా స్కూల్‌ లీవింగ్‌ సర్టిఫికెట్‌

4. ఎస్‌ఎస్‌సీ సర్టిఫికెట్‌ (వాటిపై పేరు, పుట్టిన తేదీ వివరాలు ఉంటేనే..)

5. సర్వీస్‌ రికార్డు ఆధారంగా జారీ చేసిన ధ్రువపత్రం

6. కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన పింఛను సర్టిఫికెట్‌

7. ప్రభుత్వం జారీ చేసిన నివాస ధ్రువీకరణ పత్రం

8. పాన్‌ కార్డు, పాస్‌పోర్ట్ట్, సివిల్‌ సర్జన్‌ జారీ చేసిన మెడికల్‌ సర్టిఫికెట్‌

First Published:  19 Jan 2024 11:06 AM IST
Next Story