కాంగ్రెస్ పార్టీ మొత్తం తనకు మద్దతుగా ఉన్నది : కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్
తనకు ఈ వర్గమో.. మరో వర్గమో కాదు.. కాంగ్రెస్ పార్టీ మొత్తం మద్దతుగా ఉన్నదని డీకే శివకుమార్ అన్నారు.
కన్నడనాట కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని అందుకున్నది. విశ్లేషకుల అంచనాలను మించి స్పష్టమైన మెజార్టీ సాధించిన కాంగ్రెస్.. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధపడుతోంది. కర్ణాటక ఎన్నికల ఫలితాలపై మీడియాతో మాట్లాడిన కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ భావోద్వేగానికి లోనయ్యారు. తాను సోనియా గాంధీకి ఇచ్చిన మాట ప్రకారమే.. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని గెలిపించానని చెప్పుకొచ్చారు. కర్ణాటకలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని వస్తానని పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేతో పాటు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంకలకు మాటిచ్చాను. వారికిచ్చిన మాట ప్రకారమే.. ఇవ్వాళ గెలుపును కానుకగా అందించానని శివకుమార్ అన్నారు.
తాను జైల్లో ఉన్నప్పుడు సోనియా గాంధీ పరామర్శించడానికి వచ్చారు. ఆ రోజును నేను జీవితంలో మరిచిపోలేను. కర్ణాటకలో తప్పకుండా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆ రోజు ఇచ్చిన మాట ఈ రోజు నెరవేరిందని డీకే చెప్పారు. కర్ణాటక సీఎంగా ఎన్నికవడానికి మీకు ఒక వర్గం మద్దతుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుందని.. అది నిజమేనా అని మీడియా ప్రశ్నించింది. తనకు ఈ వర్గమో.. మరో వర్గమో కాదు. కాంగ్రెస్ పార్టీ మొత్తం మద్దతుగా ఉన్నదని అన్నారు. కాంగ్రెస్ కార్యాలయమే మా దేవాలయం. అక్కడే మేం తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
కర్ణాటక ఎన్నికల్లో గెలుపు తన ఒక్కడిదే కాదని.. పార్టీలోని నాయకులు, కార్యకర్తలందరి మద్దతుతోనే సాధ్యమైందని శివకుమార్ చెప్పారు. పార్టీని గెలిపించడంలో తనకు తోడుగా ఉన్న సిద్ధిరామయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ సమిష్టి కృషితోనే ఇవాళ కర్ణాటకలో అధికారం మరోసారి సాధ్యమైందని అన్నారు. గాంధీ కుటుంబంపై కర్ణాటక ప్రజలు విశ్వాసం ఉంచారని డీకే చెప్పారు. రాష్ట్ర స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు నేతలు తీవ్రంగా శ్రమించారని కొనియాడారు. అయితే తాను సీఎం రేసులో ఉన్నానో లేనో అనే విషయంపై మాత్రం డీకే స్పష్టత ఇవ్వలేదు.
విద్వేష రాజకీయాలను కన్నడిగులు ఉపేక్షించరు : సిద్ధిరామయ్య
2018లో ఆపరేషన్ కమలం కోసం బీజేపీ భారీగా ఖర్చు చేసింది. అయితే ఆ ప్రభుత్వంతో ప్రజలు చాలా విసిగిపోయారు. విద్వేషపు రాజకీయాలను కన్నడిగులు అసలు ఉపేక్షించరని మాజీ సీఎం సిద్ధిరామయ్య అన్నారు. ఇది కాంగ్రెస్‌కు భారీ విజయం అని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పుగా దీన్ని అభివర్ణించారు. 2024లో రాహుల్ గాంధీ తప్పకుండా ప్రధాని అవుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
సోనియాకు సీఎం స్టాలిన్ ఫోన్..
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఫోన్ చేశారు. కర్ణాటకలో సాధించిన విజయానికి ఆయన అభినందనలు తెలియజేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేకు కూడా స్టాల్ కాల్ చేసి విషెస్ తెలియజేశారు.