ఎలన్ మస్క్ భారత పర్యటన వాయిదా
టెస్లా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ప్లాంట్‌ను ఇండియాలో పెట్టడానికి మస్క్ ఆసక్తి చూపిస్తున్నారని, దాని గురించి మాట్లాడేందుకే ఆయన ప్రధాని మోడీతో భేటీ అవుతున్నారని పారిశ్రామిక వర్గాల టాక్.
ప్రపంచ వ్యాపార దిగ్గజం, టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ రాక కోసం ఎదురుచూస్తున్న పారిశ్రామిక వర్గానికి నిరాశ. మస్క్ భారత పర్యటన వాయిదా పడింది. ఈనెల 21న (రేపు) ఆయన ఇండియాకు రావాల్సి ఉంది. ప్రధాని మోడీతో ఆయన భేటీ ఖరారైంది. ఈ సందర్భంగా టెస్లా ప్లాంట్‌ను భారత్‌లో నెలకొల్పే అంశంపైన ప్రధానంగా చర్చిస్తారని ముందు నుంచీ ప్రచారంలో ఉంది. అయితే అనుకోని కారణాలతో మస్క్ పర్యటన వాయిదా పడింది.
ప్లాంట్ పెడతారని ప్రచారం.. మా రాష్ట్రానికి రండంటూ ఆహ్వానాలు
టెస్లా ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ ఉంది. వీటి తయారీ ప్లాంట్‌ను ఇండియాలో పెట్టడానికి మస్క్ ఆసక్తి చూపిస్తున్నారని, దాని గురించి మాట్లాడేందుకే ఆయన ప్రధాని మోడీతో భేటీ అవుతున్నారని పారిశ్రామిక వర్గాల టాక్. ఈ నేపథ్యంలో టెస్లా ప్లాంట్‌ను మా రాష్ట్రంలో పెట్టండి అంటే.. మా రాష్ట్రంలో పెట్టండి అంటూ చాలా రాష్ట్రాలు పోటీపడి ఆహ్వానాలు పంపాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఇప్పటికే రేసులో ఉన్నాయి.
ముఖ్యమైన పనుల వల్లే వాయిదా
అయితే మస్క్ వచ్చి టెస్లా ప్లాంట్ గురించి మాట్లాడినా ఇండియాలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున దాని గురించి ప్రకటించడానికి సాంకేతిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయి. ఈనేపథ్యంలోనే మస్క్ పర్యటన వాయిదా వేసుకున్నారా అనే అనుమానాలు వస్తున్నాయి. అయితే టెస్లాకు సంబంధించిన ముఖ్యమైన పనులు నేపథ్యంలోతాను ఇండియాకు వెళ్లట్లేదని మస్క్ ఎక్స్ వేదికగా ప్రకటించారు.