Telugu Global
National

శివసేనతో ఎన్నికల పొత్తు.... ముందే ప్రకటించిన బీజేపీ

రానున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఏక్‌నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్ నాయకత్వంలో ఎన్నికలు జరగనున్నాయని, 45 లోక్‌సభ స్థానాలు, 200కి పైగా అసెంబ్లీ స్థానాలు గెలుస్తామని మహారాష్ట్ర బిజెపి చీఫ్ చంద్రశేఖర్ బవాన్‌కులే ప్రకటించారు.

శివసేనతో ఎన్నికల పొత్తు.... ముందే ప్రకటించిన బీజేపీ
X

మహారాష్ట్రలో రానున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని 'బాలాసాహెబంచి శివసేన'తో కలిసి భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంద‌ని సోమవారంనాడు రాష్ట్ర బిజెపి చీఫ్ చంద్రశేఖర్ బవాన్‌కులే ప్రకటించారు.

ఏక్‌నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్ నాయకత్వంలో ఎన్నికలు జరగనున్నాయని, 45 లోక్‌సభ స్థానాలు, 200కి పైగా అసెంబ్లీ స్థానాలు గెలుస్తామని బవాన్‌కులే తెలిపారు.

ముంబై మున్సిపల్ ఎన్నికల్లో షిండే గ్రూపుతో కలిసి పోటీ చేస్తామని బీజేపీ ఇప్పటికే సూచించింది. ముంబైలో సొంత మేయర్‌ని గెలిపించుకోవాల‌ని భావిస్తున్నామని, బాలాసాహెబంచి శివసేనతో పొత్తు పెట్టుకుంటామని ఆ పార్టీ పేర్కొంది.

'ముంబై పౌర ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి పోటీ చేస్తాయి. నేను శివసేన అని చెప్పినప్పుడు, ఏక్‌నాథ్ జీ షిండే అని గ్ర‌హించాలి. ఎందుకంటే ఆయ‌నే శివసేన అగ్రనేత బాలాసాహెబ్ థాకరే యొక్క నిజమైన భావజాలాన్ని అనుసరిస్తున్న ఏకైక హిందుత్వవాది అని నేను భావిస్తున్నాను. " అని ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు.

కాగా వ‌చ్చే నెల‌లో జ‌రిగే స్థానిక పంచాయితీల ఎన్నిక‌లు మిత్ర ప‌క్షాల‌కు స‌వాల్ గా మార‌నున్నాయి. 7,751 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జ‌రుగుతాయి. వాటి సర్పంచ్‌ల ప్రత్యక్ష ఎన్నిక మిత్రపక్షాలకు మరో అగ్నిపరీక్ష కానున్న‌ది. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఇసి) ఇప్ప‌టికే షెడ్యూల్ జారీ చేసింది. డిసెంబర్ 18న ఓటింగ్ జరగనుండగా, డిసెంబర్ 20న ఫలితాలు వెల్లడికానున్నాయి.

మహారాష్ట్రలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఇది ​​మొదటి పెద్ద పరీక్ష గా భావిస్తున్నారు. ప్రత్యేకించి ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి ప్ర‌బుత్వ ప‌త‌నం, షిండే, ‍ఫడ్నవీస్ మంత్రివర్గం ఏర్పాటు అనంత‌రం జ‌రుగుతున్న ఎన్నిక‌లు కావ‌డం ఇరు వ‌ర్గాల‌కు ప్ర‌తిష్టాత్మ‌కంగా మారాయి.

First Published:  14 Nov 2022 9:03 AM GMT
Next Story