నితీష్ ఆడుతున్నది చివరి ఇన్నింగ్స్
'ఇండియా కూటమి'ని నాశనం చేసేందుకే నితీష్ ను ఎన్డీఏలోకి బీజేపీ తీసుకువచ్చిందని చెప్పారు. నితీష్ ఎన్డీఏలోకి తిరిగి రావడం వల్ల బీజేపీకే నష్టం కలుగుతుందన్నారు.
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆడుతున్నది చివరి ఇన్నింగ్స్ అని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు. జేడీయూ అధినేత, బిహార్ సీఎం నితీష్ కుమార్ నిన్న మహాకూటమి నుంచి బయటికి వచ్చి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. గంటల వ్యవధిలోనే ఆయన ఎన్డీఏ కూటమిలో చేరి మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
కాగా, ఎన్డీఏలోకి నితీష్ మళ్ళీ చేరడంపై ప్రశాంత్ కిషోర్ తీవ్ర విమర్శలు చేశారు. నితీష్ తన జీవితంలో చివరి ఇన్నింగ్స్‌ను ఆడుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. నితీష్ ఎప్పుడు ఏం చేస్తారో ఎవరికీ తెలియదని చెప్పారు. బిహార్ ప్రజలు ఆయన్ను తిరస్కరించారన్నారు. నితీష్ తన కుర్చీని కాపాడుకోవడం కోసం ఏమైనా చేస్తారన్నారు.
నితీష్ బిహార్ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన ఏ కూటమి నుంచి ఎన్నికల్లో పోటీ చేసినా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ పార్టీకి 20 సీట్లు కూడా రావని తేల్చి చెప్పారు. ఇది నిజం కాకపోతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రశాంత్ కిషోర్ అన్నారు.
'ఇండియా కూటమి'ని నాశనం చేసేందుకే నితీష్ ను ఎన్డీఏలోకి బీజేపీ తీసుకువచ్చిందని చెప్పారు. నితీష్ ఎన్డీఏలోకి తిరిగి రావడం వల్ల బీజేపీకే నష్టం కలుగుతుందన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బిహార్లో బీజేపీ సొంతంగా పోరాడి ఉంటే మరింత లాభం ఉండేదని చెప్పారు. బీజేపీ విధ్వంసక పార్టీ అని, వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి దేశంలోని మెజారిటీ రాష్ట్రాల్లో క్లీన్ స్వీప్ చేస్తుందని ప్రశాంత్ కిషోర్ జోస్యం చెప్పారు.