హమ్మయ్య, ఇదే ఫైనల్.. రేపే షెడ్యూల్
2019లో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ని మార్చి-10న ఈసీ ప్రకటించింది. ఈసారి ఆ ప్రకటన కాస్త ఆలస్యమైంది.
ఇటీవల కాలంలో దేశంలో ఏ ఎన్నికల షెడ్యూల్ విషయంలోనూ ఇంత హడావిడి జరగలేదు. ఈసారి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రెండు నెలల ముందు నుంచీ ప్రతిరోజూ వాట్సప్ లో షెడ్యూల్ ప్రకటిస్తూనే ఉన్నారు ఔత్సాహికులు. అదిగో వచ్చేసింది, ఇదిగో వచ్చేసింది అంటూ ఆఖరికి ఎలక్షన్ కమిషన్ లెటర్ హెడ్ పైనే ఫేక్ న్యూస్ ప్రచారం చేశారు. ఆ ఫేక్ న్యూసే రేపు నిజం కాబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం రేపు మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్ మీట్ పెట్టింది. దాదాపుగా ఇదే ప్రెస్ మీట్ లో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముంది. 2019లో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ని మార్చి-10న ఈసీ ప్రకటించింది. ఈసారి ఆ ప్రకటన కాస్త ఆలస్యమైంది.
ఎందుకీ హడావిడి..?
సహజంగా తమకు తెలిసిన విషయాన్ని అందరితో పంచుకోవాలని వాట్సప్ స్టేటస్ లలో తాజా వార్తల్ని పోస్ట్ చేస్తుంటారు చాలామంది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విషయంలో ఈ ఉత్సాహం మరింత ఎక్కువగా మారింది. అందుకే ఎవరికి వారు వాట్సప్ లో, సోషల్ మీడియాలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేసుకున్నారు. ఫేక్ న్యూస్ ని విపరీతంగా ప్రచారం చేశారు. అందులోనూ ఏపీ ఎన్నికలపై అందరికీ విపరీతమైన ఆసక్తి ఏర్పడింది. అందుకే ఎన్నికల షెడ్యూల్ విషయంలో ఎవరికి వారే తొందర పడ్డారు.
రేపు ఖాయమేనా..?
సార్వత్రిక ఎన్నికలతోపాటు, ఈసారి 4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగాల్సి ఉంది. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం ఆయా రాష్ట్రాల్లో ఏర్పాట్ల పరిశీలన పూర్తి చేసింది, నేరుగా ఈసీ బృందం పర్యటనలు కూడా పూర్తయ్యాయి. ఇక ప్రకటనే తరువాయి. మార్చి-16 మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది ఈసీ. అన్ని పనులు పూర్తయ్యాయి కాబట్టి ఇక షెడ్యూల్ ప్రకటనే మిగిలి ఉంది. అది రేపు మధ్యాహ్నం బయటకొచ్చే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. లోక్ సభతోపాటు అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్ర ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఒకేసారి నోటిఫికేషన్ వెలువడే అవకాశముంది. షెడ్యూల్ ప్రకటన పూర్తయితే రేపటి నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్.. లోక్‌సభ ఎన్నికల తేదీలపై ప్రకటన చేస్తారని ఇదే ప్రెస్‌మీట్‌లో కొత్త కమిషనర్లు జ్ఞానేంద్ర కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధూ కూడా పాల్గొంటారని తెలుస్తోంది. జమ్మూకాశ్మీర్ ఎన్నికలపై ఈసీ ప్రకటన ఉంటుందా లేదా అనేది తేలాల్సి ఉంది.