ఉద్ధవ్, షిండే పార్టీల కొత్త పేర్లు ఇవే!
ఉద్దవ్ ఠాక్రే, ఏక్ నాథ్ షిండే వర్గాల పార్టీ పేర్లను ఎన్నికల సంఘం డిసైడ్ చేసింది. ఉద్దవ్ ఠాక్రే వర్గానికి 'శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) పేరును, షిండే వర్గానికి 'బాలాసాహెబంచి శివసేన' అనే పేర్లను కేటాయించింది ఈసీ.
శివసేనలోని ఉద్ధవ్ ఠాక్రే, ఏక్నాథ్ షిండే ల వర్గాలకు ఎన్నికల సంఘం సోమవారం కొత్త పేర్లను కేటాయించింది. ఒక వర్గానికి ఎన్నికల గుర్తును కూడా కేటాయించింది.
ఈసీ ఉద్దవ్ ఠాక్రే వర్గానికి 'శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) పేరును, షిండే వర్గానికి 'బాలాసాహెబంచి శివసేన' అనే పేర్లను కేటాయించింది. ఉద్దవ్ వర్గానికి ఎన్నికల గుర్తుగా మండుతున్న కాగడాని కేటాయించింది.అయితే షిండే వర్గం కోరుకున్న 'త్రిశూల్', 'రైజింగ్ సన్' , 'గడ' "ఉచిత చిహ్నాల జాబితాలో లేనందున" వాటిని గుర్తులుగా కేటాయించడానికి నిరాకరించింది.
రేపటిలోగా 3 తాజా చిహ్నాల జాబితాను అందజేయాలని భారత ఎన్నికల సంఘం షిండే వర్గాన్ని కోరింది
EC నిర్ణయంపై మహారాష్ట్ర కేబినెట్ మంత్రి దీపక్ కేసర్కర్ మాట్లాడుతూ, "ఈ రోజు ఎన్నికల సంఘం ఇచ్చిన నిర్ణయాన్ని అందరూ అంగీకరించాలి. ఈ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాము" అని అన్నారు.
"మాకు బాలాసాహెబ్ ఠాక్రే శివసేన అని పేరు వచ్చింది. బాలాసాహెబ్ పేరు మాతో ఉంటుంది. ఉద్దవ్ ఠాక్రే శివసేన ఒకవైపు, మా బాలాసాహెబ్ శివసేన మరోవైపు" అని ఆయన అన్నారు.
"మేము బాలాసాహెబ్ హిందుత్వ ఆలోచనలను అనుసరిస్తాము, అందుకే మాకు బాలాసాహెబ్ అని పేరు వచ్చింది. ఏక్నాథ్ షిండే బాలాసాహెబ్ ఆశీర్వాదం పొందారు. ఉద్ధవ్ ఠాక్రే హిందుత్వను విడిచిపెట్టాడు, కాబట్టి అతనికి బాలాసాహెబ్ అనే పేరు రాలేదు" అని ఠాక్రే వర్గంపై విమర్శలు చేశారు.
ఎన్నికల గుర్తుపై రేపటిలోగా ఏక్‌నాథ్ షిండే చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.