Telugu Global
National

తండ్రి సీఎం, సీటులో కొడుకు.. ఏంటీ పంచాయితీ..?

ముఖ్యమంత్రి షిండే అందుబాటులో లేనప్పుడు ఆయన కొడుకు ఇలా బాధ్యతలు నిర్వహిస్తున్నారంటూ ట్వీట్ చేశారు ఎన్సీపీ నేత రవికాంత్ వార్పే. సూపర్‌ సీఎం అయినందుకు శ్రీకాంత్‌ షిండేకు అభినందనలు అంటూ ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

తండ్రి సీఎం, సీటులో కొడుకు.. ఏంటీ పంచాయితీ..?
X

తండ్రి సీఎం అయితే కొడుక్కి రాష్ట్రాన్ని రాసిచ్చేస్తారని చెప్పలేం. అలాగని తండ్రిని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేసే కొడుకులు ఉండరని కూడా చెప్పలేం. అయితే చాలా వరకు తండ్రి సీఎం అయితే, ఆయన పొలిటికల్ పలుకుబడితో కొడుకులు ఎదగాలనుకుంటారు. మహారాష్ట్ర విషయానికొస్తే ఉద్ధవ్ ఠాక్రే సీఎంగా ఉన్నప్పుడు, ఆయన మంత్రి వర్గంలో ఆదిత్య ఠాక్రే ఉన్నారు. అయితే ఇప్పుడు ఉద్ధవ్ ప్లేస్ లో ఏక్ నాథ్ షిండే వచ్చాక, ఆయన కొడుకు మ‌రింత జోరు చూపిస్తున్నారని అర్థమవుతోంది. ఏకంగా ఏక్ నాథ్ కుర్చీలోనే ఆయన కొడుకు శ్రీకాంత్ షిండే కూర్చుంటున్నారు. తండ్రిలేని సమయంలో పనులు చక్కబెడుతున్నారు.

సూపర్ సీఎం..

ఏక్ నాథ్ షిండే, బీజేపీ చేతిలో కీలుబొమ్మగా మారిపోయారంటుంది శివసేన. కానీ ఏక్ నాథ్ షిండే కొడుకు అంతకంటే మహా ముదురు అంటున్నారు. శ్రీకాంత్ షిండే ఇప్పటినుంచే తండ్రిని అనుసరిస్తున్నాడు. ఏకంగా తండ్రి కుర్చీలో కూర్చుని అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వ్యవహారం రచ్చకెక్కింది. సూపర్‌ సీఎం అంటూ శివసేన, ఎన్సీపీ నాయకులు సెటైర్లు పేలుస్తున్నారు.

ఎన్సీపీకి చెందిన రవికాంత్‌ వార్పే, శ్రీకాంత్ షిండే ఫొటోను షేర్‌ చేస్తూ సూపర్ సీఎం అని కామెంట్ పెట్టారు. ముఖ్యమంత్రి అందుబాటులో లేనప్పుడు ఆయన కొడుకు ఇలా బాధ్యతలు నిర్వహిస్తున్నారంటూ ట్వీట్ చేశారు రవికాంత్ వార్పే. సూపర్‌ సీఎం అయినందుకు శ్రీకాంత్‌ షిండేకు అభినందనలు అంటూ ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మహారాష్ట్రలోని 13కోట్లమంది ప్రజల ఆత్మగౌరవ పీఠానికి సంబంధించిన విషయం ఇదని అన్నారు రవికాంత్.

మహిళా రిజర్వేషన్ల వల్ల సీట్లు కోల్పోయిన నాయకులు తమ కుటుంబ సభ్యులను ఎన్నికల్లో నిలబెట్టి ఆ తర్వాత వారే పనులు చక్కబెడుతుంటారు. అప్పుడు కూడా వారు నేరుగా మహిళల సీట్లలో కూర్చోరు, వారి పక్కనే మరో సీటు వేసుకుని షాడో నేతల్లా చలామణి అవుతుంటారు. కానీ ఇక్కడ సీఎం అధికారిక నివాసంలో వెనక సీఎం అనే బోర్డ్ ఉన్నప్పుడు ఆ సీటులో సీఎం కొడుకు కూర్చుని పనులు చక్కబెట్టడం సంచలనంగా మారింది. ఏక్ నాథ్ షిండే మరీ అంత అసమర్థుడిగా మారిపోయారా అని ప్రశ్నిస్తున్నాయి ప్రతిపక్షాలు.

First Published:  23 Sept 2022 5:46 PM IST
Next Story