ఈవీఎం హ్యాకింగ్.. ఇదిగో సాక్ష్యం?
ఈవీఎం మెషిన్ల ద్వారా ఓట్ల లెక్కింపు జరిగినప్పుడు శివసేన ఉద్ధవ్ వర్గం అభ్యర్థి క్రితికార్ లీడ్‌లో నిలిచారు. కానీ ఎలక్ట్రానికల్ ట్రాన్స్‌మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ లెక్కించినప్పుడు క్రితికార్ వెనుకబడిపోయి.. కేవలం 48 ఓట్ల తేడాతో రవీంద్ర వైకర్ విజయం సాధించారు.
సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు (EVM) పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈవీఎంల హ్యాకింగ్, ట్యాంపరింగ్‌పై సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఫలితాలను తారుమారు చేశారంటూ ఆరోపణలు కూడా వస్తున్నాయి. తాజాగా ముంబై నార్త్ వెస్ట్ పార్లమెంట్ నియోజకవర్గంలో వెలుగులోకి వచ్చిన ఘటన ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.
శివసేన (ఏక్‌నాథ్ షిండే వర్గం) ఎంపీ అభ్యర్థి రవీంద్ర వైకర్ బావమరిది మంగేష్ పండిల్కర్.. కౌంటింగ్ రోజు మొబైల్ ఫోన్‌కు వచ్చిన OTPతో ఈవీఎంలను ఓపెన్ చేసినట్లు గుర్తించారు. దేశ రాజకీయాల్లో ఈ అంశం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటనలో మంగేష్ పండిల్కర్‌పై కేసు నమోదు చేశారు స్థానిక వన్‌రాయ్ పోలీసులు. జూన్ 4న ఓట్ల లెక్కింపు సందర్భంగా NESCO సెంటర్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ఫోన్‌ను ఇప్పటికే ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీకి పంపిన అధికారులు అందులోని డేటా, కాల్ రికార్డ్స్‌తో పాటు ఫోన్‌పై ఉన్న ఫింగర్ ప్రింట్స్‌ను విశ్లేషిస్తున్నట్లు సమాచారం.
ముంబై నార్త్ వెస్ట్ పార్లమెంట్ స్థానం నుంచి శివసేన షిండే వర్గం నుంచి రవీంద్ర వైకర్, శివసేన ఉద్ధవ్ వర్గం నుంచి అమోల్ గజానన్ క్రితికార్ పోటీ చేశారు. ఈవీఎం మెషిన్ల ద్వారా ఓట్ల లెక్కింపు జరిగినప్పుడు శివసేన ఉద్ధవ్ వర్గం అభ్యర్థి క్రితికార్ లీడ్‌లో నిలిచారు. కానీ ఎలక్ట్రానికల్ ట్రాన్స్‌మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ లెక్కించినప్పుడు క్రితికార్ వెనుకబడిపోయి.. కేవలం 48 ఓట్ల తేడాతో రవీంద్ర వైకర్ విజయం సాధించారు. ఈ ఫలితంపై ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక ఇదే అంశంపై ఇటీవల ఏపీలో ఊహించని విధంగా పరాజయం పాలైన వైసీపీ సైతం ట్వీట్ చేసింది. తన ట్వీట్‌లో ముంబై నార్త్ వెస్ట్ సీటు ఫలితాన్ని ప్రస్తావించింది. ఏపీలోనూ చాలా నియోజకవర్గాల్లో పోలైన ఓట్లు, లెక్కించిన ఓట్ల మధ్య భారీ తేడాలున్నట్లు వైసీపీ అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ముంబై నార్త్ వెస్ట్ సీటు ఘటనతో వైసీపీ అభ్యర్థుల అనుమానాలకు మరింత బలం చేకూర్చినట్లయింది. టెస్లా చీఫ్, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ సైతం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను హ్యాక్ చేయొచ్చంటూ ట్వీట్ చేయడం గమనార్హం. ఇటీవల అమెరికా అధీనంలో ఫ్యూర్టోరికోలో జరిగిన ఎన్నికల్లో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని ఆయన ఆరోపించారు. అక్రమాలు జరగకుండా ఉండాలంటే ఈవీఎంలను ఉపయోగించొద్దని సూచించారు.