ఓన్లీ జనరిక్..! - వైద్యులకు కేంద్రం సూచన
కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రుల ప్రాంగణాలకు మెడికల్ రిప్రజెంటేటివ్‌లను రానివ్వొద్దని చెప్పింది. వారి రాకను పూర్తిగా తగ్గించాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆస్పత్రులు, సీజీహెచ్ఎస్ వెల్‌నెస్ కేంద్రాల్లోని వైద్యులకు కేంద్రం తాజాగా ఓ సూచన చేసింది. దానిని పాటించకపోతే చర్యలు తప్పవని కూడా హెచ్చరించింది. ఇంతకీ ఆ సూచన ఏమిటంటే.. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆస్పత్రులు, సీజీహెచ్ఎస్ వెల్‌నెస్ కేంద్రాలకు వచ్చే రోగులకు చౌకగా లభించే జనరిక్ మందులను మాత్రమే రాయాలని. దీనిని మీరిన వారిపై చర్యలు తప్పవని కూడా హెచ్చరించడం గమనార్హం.
మెడికల్ రిప్‌లను రానివ్వొద్దు..
కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రుల ప్రాంగణాలకు మెడికల్ రిప్రజెంటేటివ్‌లను రానివ్వొద్దని చెప్పింది. వారి రాకను పూర్తిగా తగ్గించాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. వైద్య సేవల డైరెక్టర్ జనరల్ డాక్టర్ అతుల్ గోయల్ ఈ మేరకు ఈ నెల 12వ తేదీన ఈ ఆదేశాలు జారీ చేశారు. తాజాగా అవి వెలుగులోకి వచ్చాయి.
బ్రాండెడ్‌ను తగ్గించేందుకే...
కొందరు వైద్యులు రోగులకు జనరిక్‌కు బదులుగా బ్రాండెడ్ మందులు రాస్తున్నారని గోయల్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆ పరిస్థితిని నివారించేందుకు తాజా ఆదేశాలు ఇచ్చినట్టు గోయల్ తెలిపారు. జనరిక్‌తో రోగులపై మందుల వ్యయ భారం తగ్గుతుందని పేర్కొన్నారు.