Telugu Global
National

కర్ణాటక ఎన్నికల తాజా సర్వే.. కాంగ్రెస్ క్లీన్ స్వీప్

కర్ణాటక ఎన్నికల తాజా సర్వే 2023: గత ఎన్నికల్లో కాంగ్రెస్ కి వచ్చిన ఓట్ షేర్ 38.1 శాతం కాగా, ఈసారి హస్తం పార్టీకి 43 శాతం ఓట్లు దక్కే అవకాశముందని 'ఈ దిన' సర్వే చెబుతోంది. బీజేపీ ఓట్ షేర్ 3.3 శాతం, జేడీఎస్ ఓట్ షేర్ 2.7 శాతం మేర తగ్గే అవకాశముంది.

Karnataka latest pre-poll survey 2023
X

కర్ణాటక ఎన్నికల తాజా సర్వే.. కాంగ్రెస్ క్లీన్ స్వీప్

కర్నాటక ఎన్నికలకు టైమ్ దగ్గరపడేకొద్దీ ఓటరు నాడి విషయంలో పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన సర్వేలన్నీ కాంగ్రెస్ కే మొగ్గు చూపిస్తున్నా, హంగ్ తప్పదని తేల్చి చెబుతున్నాయి. 224 అసెంబ్లీ సీట్లున్న కర్నాటక విధాన సభలో ఏ ఒక్క పార్టీకి కూడా 113 సీట్లు వచ్చే అవకాశం లేవని తేల్చేశాయి సర్వేలు. కానీ తాజా సర్వే కాంగ్రెస్ శిబిరంలో సంతోషం నింపింది. 'ఈ దిన' సంస్థ నిర్వహించిన సర్వేలో కాంగ్రెస్ కి అధికారం ఖాయమని తేలిపోయింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 113 స్థానాలకంటే ఎక్కువగా.. అంటే 132 నుంచి 140 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని 'ఈ దిన' సర్వే తేల్చి చెప్పింది.

ఆషామాషీ సర్వే కాదు..

ఎన్నికల వేళ, రాజకీయ పార్టీలు వివిధ రకాలుగా సర్వేలు చేయిస్తుంటాయి, ఫలితాలను మాత్రం తమకి అనుకూలంగా ప్రకటించుకుంటాయి. కొన్ని థర్ట్ పార్టీలు సర్వేలు చేపట్టినా.. ఫలితాల ప్రకటనలో రాజకీయ పార్టీల ప్రమేయం కాస్తో కూస్తో ఉంటుంది. కానీ 'ఈ దిన' సర్వేలో పాల్గొన్నది సిటిజన్ జర్నలిస్ట్ లు. వీరంతా 'ఈ దిన' వెబ్ సైట్ కోసం పనిచేస్తారు. వెయ్యిమందికి పైగా సిటిజన్ జర్నలిస్ట్ లతో ప్రజల అభిప్రాయాలను సేకరించి కాచి వడపోసి ఈ సర్వే ఫలితాలు బయటపెట్టారు.


'ఈ దిన' సర్వే ఫలితాలు..

కాంగ్రెస్ పార్టీకి 132 నుంచి 140 స్థానాల్లో గెలుపు ఖాయమని సర్వే తేల్చి చెప్పింది. 57 నుంచి 65 సీట్లతో బీజేపీ రెండో స్థానానికి పరిమితం అవుతుందని, 19-25 సీట్లతో జేడీఎస్ మూడో స్థానంలో నిలుస్తుందనేది సర్వే రిపోర్ట్. ఇతరులు ఒకటి నుంచి 5 స్థానాల్లో తమ ప్రభావం చూపిస్తారు.

పెరుగుతున్న కాంగ్రెస్ ఓట్ షేర్..

గత ఎన్నికల్లో కాంగ్రెస్ కి వచ్చిన ఓట్ షేర్ 38.1 శాతం కాగా, ఈసారి హస్తం పార్టీకి 43 శాతం ఓట్లు దక్కే అవకాశముందని 'ఈ దిన' సర్వే చెబుతోంది. బీజేపీ ఓట్ షేర్ 3.3 శాతం, జేడీఎస్ ఓట్ షేర్ 2.7 శాతం మేర తగ్గే అవకాశముంది. బీజేపీ ప్రభుత్వమే తిరిగి రావాలని 33శాతం మంది కర్నాటక ప్రజలు కోరుకుంటుండగా.. మిగిలిన 67 శాతం మంది ఈ ప్రభుత్వం తమకు వద్దు అని అభిప్రాయ పడినట్టు సర్వే తేల్చింది. తటస్థులెవరూ లేకపోవడం విశేషం.

హైదరాబాద్ కర్నాటక ప్రాంతంలో మొత్తం 40 స్థానాలు ఉండగా అందులో 31 నుంచి 37 సీట్లలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని అంటున్నారు. బీజేపీ, జేడీఎస్ లు రెండూ.. ఇక్కడ 2నుంచి 4 స్థానాలకే పరిమితం అవుతాయని తేలింది. ముంబై కర్నాటకలో 50 స్థానాలకు గాను కాంగ్రెస్ 40-46 సీట్లు, బీజేపీ 3-7, జేడీఎస్ 0-2 సీట్లు గెలుస్తాయని తెలుస్తోంది. కోస్టల్ కర్నాటకలో బీజేపీదే పైచేయి అని, మిగతా చోట్ల హోరాహోరీ పోరు సాగుతుందని సర్వేలు చెబుతున్నాయి.

కాంగ్రెస్ లో ఊపు..

'ఈ దిన' సర్వేతో కాంగ్రెస్ లో ఊపు వచ్చింది. గతంలో లాగా పొత్తులతో కుస్తీలు పడకుండా ఈసారి కర్నాటక ప్రజలు క్లియర్ మెజార్టీ ఇస్తారని తేలిపోయింది. ఎన్నికల ప్రచారంలో కూడా కాంగ్రెస్ దూసుకెళ్తోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే 2024 సార్వత్రిక ఎన్నికలపై ఆ ప్రభావం కచ్చితంగా ఉంటుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

First Published:  28 April 2023 6:49 PM IST
Next Story