Telugu Global
National

మొన్న మోదీకి లేఖ రాశారు.. నిన్న ఈడీ ఇంటికెళ్లింది

ఆమ్ ఆద్మీ నేత సిసోడియా అరెస్ట్, బీఆర్ఎస్ నేత కవితకు ఈడీ నోటీసులు, ఆర్జేడీ నేత తేజస్వి ఇంట్లో ఈడీ సోదాలు.. ప్రతిపక్షాలకు చెందినవారినే దర్యాప్తు సంస్థలు వరుసగా టార్గెట్ చేస్తున్నాయనడానికి ఇది మరో ఉదాహరణ మాత్రమే.

మొన్న మోదీకి లేఖ రాశారు.. నిన్న ఈడీ ఇంటికెళ్లింది
X

ఇటీవల ప్రధాని మోదీకి 9మంది నేతలు ఘాటు లేఖ రాసిన సంగతి తెలిసిందే. అందులో బీహార్ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కూడా ఉన్నారు. కట్ చేస్తే ఆ లేఖ రాసిన తర్వాత ఈడీ, తేజస్వీ యాదవ్ ఇంటిలో సోదాలు జరిపింది. కక్షసాధింపు చర్యగా దీన్ని అభివర్ణిస్తూ ఆర్జేడీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.

రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం, ఉద్యోగాలిప్పించేందుకు కొంతమంది వద్ద లంచం కింద భూములు తీసుకుందనే అభియోగాలపై సీబీఐ కొంతకాలంగా దర్యాప్తు చేస్తోంది. ఈ కేసు విచారణలో భాగంగా చాలాసార్లు లాలూ ప్రసాద్ యాదవ్ ని సీబీఐ ప్రశ్నించింది. ఆయన ఇంట్లో సోదాలు కూడా నిర్వహించింది. అయితే ఇప్పుడు కొత్తగా ఆయన తనయుడు తేజస్వీ యాదవ్ ని కూడా కేంద్రం టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. తేజస్వీ యాదవ్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. బీహార్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌, ముంబైలో ఈ సోదాలు జరిగాయి.

మనీలాండరింగ్ కేసులో భాగంగా ఆధారాలను గుర్తించేందుకు ఈ తనిఖీలు చేపట్టినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. యూపీఏ సర్కారు హయాంలో 2004 నుంచి 2009 వరకు లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో ఆయనపై ల్యాండ్ ఫర్ జాబ్స్ అనే ఆరోపణలు వచ్చాయి. బీజేపీ అధికారంలోకి వచ్చాక విచారణ జోరందుకుంది. అయితే ఇప్పుడు ఈడీ కూడా ఇందులో జోక్యం చేసుకోవడం, మనీ లాండరింగ్ వ్యవహారంలో లాలూ తనయుడు తేజస్వి ఇంట్లో సోదాలు చేపట్టడంతో ఆర్జేడీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ప్రతిపక్షంపై దాడిగా అభివర్ణిస్తున్నారు. ఆమ్ ఆద్మీ నేత సిసోడియా అరెస్ట్, బీఆర్ఎస్ నేత కవితకు ఈడీ నోటీసులు, ఆర్జేడీ నేత తేజస్వి ఇంట్లో ఈడీ సోదాలు.. ప్రతిపక్షాలకు చెందినవారినే దర్యాప్తు సంస్థలు వరుసగా టార్గెట్ చేస్తున్నాయనడానికి ఇది మరో ఉదాహరణ మాత్రమే.

First Published:  10 March 2023 9:37 AM GMT
Next Story