215 కోట్ల బలవంతపు వసూళ్ల కేసులో నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్.. ఈడీ ఛార్జ్ షీట్
ఈడీ అరెస్టు చేసిన సుకేష్ చంద్రశేఖర్ తోపాటు బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా వందల కోట్ల రూపాయల బలవంతపు వసూళ్ళకు పాల్పడ్డారని ఈడీ చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారవేత్త భార్య నుంచి వీళ్ళు 215 కోట్లను బలవంతంగా వసూలు చేసినట్టు ఆరోపణలు చేస్తోంది ఈడీ.
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ చుట్టూ ఈడీ ఉచ్చు మరింత బిగించింది. 215 కోట్ల బలవంతపు వసూళ్లకేసులో నిందితురాలిగా ఈమెను తమ అనుబంధ చార్జ్ షీట్ లో పేర్కొంది. తన బాయ్ ఫ్రెండ్ సుకేష్ చంద్రశేఖర్ నుంచి రూ. 10 కోట్ల విలువైన ఖరీదైన బహుమతులను అందుకున్న ఈమె బలవంతంగా వసూలు చేసిన సొమ్ముతో అనుభవిస్తున్న విలాసాలకు అంతులేదని, వీడియో కాల్స్ ద్వారా ఈమె సుకేష్ చంద్రశేఖర్ తో సదా టచ్ లో ఉంటూవచ్చిందని ఈడీ... తన ఛార్జ్ షీట్ లో వివరించింది. ఆమెకు తాను కాస్ట్లీ గిఫ్ట్ లు ఇచ్చినట్టు చంద్రశేఖర్ కూడా అంగీకరించినట్టు అధికారులు తెలిపారు. మనీలాండరింగ్ నివారణ చట్టం కింద జాక్వెలిన్ కి చెందిన రూ. 7 కోట్లకు పైగా విలువైన ఆస్తులను ఈడీ ఇప్పటికే ఎటాచ్ చేసింది. సుకేష్ చంద్రశేఖర్ కి, ఈమెకు మధ్య జరిగిన లావాదేవీలపై అధికారులు ఇదివరకే ఆమెను చాలాసార్లు విచారించారు. చంద్రశేఖర్ పై 32 క్రిమినల్ కేసులు దాఖలై ఉన్నాయి. సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను శాఖ అధికారులు సైతం అతడ్ని ఇంటరాగేట్ చేశారు.
ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారవేత్త భార్య నుంచి ఇతగాడు 215 కోట్లను బలవంతంగా వసూలు చేసినట్టు ఇతనిపై ఆరోపణలు ఉన్నాయి. తనను ప్రధానమంత్రి కార్యాలయం, లేదా న్యాయమంత్రిత్వ శాఖ లేక హోమ్ శాఖకు చెందిన అధికారిగా చెప్పుకుంటూ చంద్రశేఖర్ ఆమెను బురిడీ కొట్టించినట్టు తెలుస్తోంది. బాధితురాలి భర్తకు బెయిల్ లభించేలా చూస్తానని, వారి ఫార్మాసిటికల్ బిజినెస్ నడిచేలా అన్ని ప్రయత్నాలూ చేస్తానని ఆమెకు మాయమాటలు చెప్పి ఇన్ని కోట్లు వసూలు చేసినట్టు ఈడీ భావిస్తోంది. 5 ఏళ్ళ క్రితం తమిళనాడు పొలిటీషియన్ టీటీవీ. దినకరన్ ను సైతం ఛీట్ చేశాడన్న కేసు ఇతనిపై నమోదై ఉంది. దీనికి సంబంధించి గతంలో ఇతడిని ఈడీ అరెస్టు చేసింది. అంతకుముందు గత ఏడాది ఆగస్టులో కూడా ఢిల్లీ పోలీసులు చంద్రశేఖర్ ని అరెస్టు చేశారు.
ర్యాన్ బ్యాక్సీ మాజీ ప్రమోటర్లను బుట్టలో వేసుకున్న చంద్రశేఖర్
లోగడ ఫార్మాసిటికల్ కంపెనీ..' ర్యాన్ బ్యాక్సీ' మాజీ ప్రమోటర్లయిన అదితి సింగ్, శివేంద్ర సింగ్ అనే వ్యక్తులనుంచి చంద్రశేఖర్ కోట్లాది రూపాయలను బలవంతంగా వసూలు చేశాడట. ఈ దందాలో ఇతనికి ఇతని భార్య లీనా మరియా పాల్ కూడా సహకరించేదని వెల్లడైంది. ఆమెను కూడా లోగడ ఈడీ అధికారులు అరెస్టు చేశారు. శ్రీలంకలో పుట్టిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ .. చంద్రశేఖర్ కి ఎలా పరిచయమైందో గానీ ఇద్దరూ డేటింగ్ చేసేంతవరకు వెళ్ళింది. 2009 లో ఈమె మొదటిసారిగా బాలీవుడ్ చిత్ర రంగంలోకి అడుగు పెట్టింది.