Telugu Global
National

తొమ్మిదోసారి.. ఈసారి మరో కేసులో -కేజ్రీవాల్‌కు మరోసారి ఈడీ సమన్లు

కేజ్రీవాల్‌ను ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా అడ్డుకునేందుకు కేంద్రం మరో తప్పుడు కేసుతో ఆయన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తోందని ఆప్‌ నేతలు మండిపడుతున్నారు.

తొమ్మిదోసారి.. ఈసారి మరో కేసులో  -కేజ్రీవాల్‌కు మరోసారి ఈడీ సమన్లు
X

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు మరోసారి ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేశారు. ఇప్పటివరకు 8 సార్లు ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సమన్లు జారీ చేయగా, ఈసారి ఢిల్లీ జలమండలిలో చోటుచేసుకున్న అవకతవకలకు సంబంధించిన కేసులో నోటీసులు ఇవ్వడం గమనార్హం. ఏదేమైనా కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు ఇవ్వడం ఇది తొమ్మిదోసారి. ఢిల్లీ జలమండలిలో చోటుచేసుకున్న అవకతవకలకు సంబంధించిన కేసులో మార్చి 21న ఈడీ కేంద్ర కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని తాజా నోటీసులో పేర్కొన్నారు.

గతంలో మద్యం పాలసీ కేసులో 8 సార్లు నోటీసులు జారీ చేసినా.. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ స్పందించకపోవడంతో ఢిల్లీ న్యాయస్థానంలో ఈడీ రెండు ఫిర్యాదులు నమోదు చేసింది. వాటిపై న్యాయస్థానం శనివారం విచారణ చేపట్టగా.. కేజ్రీవాల్‌ కోర్టు ముందు హాజరయ్యారు. ఆ కేసుల్లో చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ ఆయనకు బెయిల్‌ మంజూరు చేశారు. అయితే.. ఈడీ మరుసటిరోజే మరోసారి జలమండలి కేసులో నోటీసులు ఇవ్వడం గమనార్హం.

కేజ్రీవాల్‌ను ప్రచారం చేయకుండా అడ్డుకునేందుకే..

కేజ్రీవాల్‌ను ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా అడ్డుకునేందుకు కేంద్రం మరో తప్పుడు కేసుతో ఆయన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తోందని ఆప్‌ నేతలు మండిపడుతున్నారు. ఈ అంశంపై ఢిల్లీ మంత్రి అతిశీ ఆదివారం స్పందిస్తూ.. మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌ను అరెస్ట్‌ చేయలేమని భావించిన కేంద్రం మరో కుట్ర పన్నిందని ధ్వజమెత్తారు. తాజా నోటీసులు అందులో భాగంగానే ఇచ్చినట్టు ఆయన ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో కేజ్రీవాల్‌ను ప్రచారం చేయనీయకుండా అడ్డుకునేందుకు ఈ కుట్ర పన్నిందని మండిపడ్డారు.

First Published:  17 March 2024 3:17 PM IST
Next Story