2005 నుండి ఈడీ నమోదు చేసిన కేసులు 5,906, పరిష్కారమైనవి 25 మాత్రమే
25 కేసులలో, 24 కేసులలో నేరారోపణలను రుజువు చేశామని ఈడీ చెప్పుకుంటోంది. కానీ 17 సంవత్సరాల లో కేవలం 25 కేసులను మాత్రమే ముగించగలిగింది. ఇది ప్రభుత్వ యంత్రాంగం, న్యాయవ్యవస్థ ఎలా పని చేస్తున్నాయో స్పష్టంగా తెలియజేస్తుంది.
2005 నుండి, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) 5,906 కేసులను నమోదు చేసింది. ఆ కేసుల్లో దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేయగలిగింది 1,142 కేసుల్లో మాత్రమే. వాటిలో 25 కేసులను మాత్రమే పరిష్కరించగలిగింది. అంటే మొత్తం కేసులలో కేవలం 0.42% మాత్రమే. కానీ ఈడీ మాత్రం 96% నేరారోపణలను రుజువు చేశామని గొప్పలు చెప్పుకుంటోంది.
25 కేసులలో, 24 కేసులలో నేరారోపణలను రుజువు చేశామని ఈడీ చెప్పుకుంటోంది. కానీ 17 సంవత్సరాల లో కేవలం 25 కేసులను మాత్రమే ముగించగలిగింది. ఇది ప్రభుత్వ యంత్రాంగం, న్యాయవ్యవస్థ ఎలా పని చేస్తున్నాయో స్పష్టంగా తెలియజేస్తుంది.
అధికార బిజెపి ప్రభుత్వం జాతీయ దర్యాప్తు సంస్థలను తన ఆయుధాలుగా మారుస్తోందని, ప్రత్యేకించి ప్రతిపక్ష నాయకులపై కక్ష తీర్చుకోవడానికి ఉపయోగించుకుంటోందని ఆరోపణలున్నాయి. మహారాష్ట్ర గత మహావికాస్ అఘాడీ ప్రభుత్వ మంత్రుల నుండి తెలంగాణ బీఆరెస్, ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నాయకుల వరకు, చాలా మంది ప్రతిపక్ష నాయకులు ఇటీవలి కాలంలో ఈడీ కేసులను ఎదుర్కొంటున్నారు. కానీ ఈడీ, ఇటీవల విడుదల చేసిన డేటాలో, మొత్తం కేసులలో 3% మాత్రమే, ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులు నిందితులుగా ఉన్నారని పేర్కొంది. 5,906 కేసుల్లో కేవలం 176 మాత్రమే సిట్టింగ్, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప్రమేయం ఉందని పేర్కొంది.
రాజకీయ నాయకులపై ఈడీ పెట్టిన కేసుల్లో దాదాపు 85% కేసులు ప్రతిపక్ష నాయకులపై నమోదయ్యాయని ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రచురించిన ఒక నివేదిక తెలిపింది.
2014లో NDA ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రతిపక్ష రాజకీయ నాయకులు, వారి దగ్గరి బంధువులపై ఈడీ దాడులు పెద్ద సంఖ్యలో పెరిగాయని ఎక్స్ ప్రెస్ పేర్కొంది. “2014 సంవత్సరం నుండి 121 మంది ప్రముఖ రాజకీయ నాయకులను ఏజెన్సీ విచారించింది. వీరిలో 115 మంది ప్రతిపక్ష నాయకులను బుక్ చేసింది, దాడి చేసింది, ప్రశ్నించింది, అరెస్టు చేసింది ” అని ఎక్స్‌ప్రెస్ నివేదించింది.
ప్రముఖ వెబ్ పోర్టల్ 'స్క్రోల్' కూడా ED పనితీరుపై పరిశోధన నిర్వహించింది. PMLAకి 2019లో సవరణల తర్వాత కేసులు పెద్ద ఎత్తున పెరిగాయని స్క్రోల్ పేర్కొంది. "ఏప్రిల్ 2020, మార్చి 2021 మధ్య, ఒక వైపు కోవిడ్ -19 మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేస్తున్న సమయంలో, భారతదేశం నెలల తరబడి లాక్‌డౌన్‌లో ఉన్నప్పుడు, PMLA కింద 981 కేసులు నమోదయ్యాయి. ఈ చట్టం ఉనికిలోకి వచ్చినప్పటి నుండి ఇదే అత్యధికం" అని స్క్రోల్ నివేదిక పేర్కొంది.
ఈడీ ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుందని స్క్రోల్ కూడా తన నివేదికలో పేర్కొంది. “వాస్తవంగా భారతదేశంలోని ప్రతి ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకులు మనీలాండరింగ్ కేసులతో పోరాడుతున్నారు. ముఖ్యంగా, బిజెపితో పోరాడుతున్న రాజకీయ నాయకులపై ఈడీ కేసులుపెరుగుతున్నాయి. ''అని స్క్రోల్ తన నివేదికలో తెలిపింది.