Telugu Global
National

శివసేన నేత సంజయ్ రౌత్ అరెస్ట్

పత్రా చాల్ ల్యాండ్ స్కామ్ లో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. ఉదయం నుంచి ఆయన ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్న ఈడీ మధ్యహ్నం ఆయనను అరెస్టు చేసింది.

శివసేన నేత సంజయ్ రౌత్ అరెస్ట్
X

మనీ లాండరింగ్ కేసులో శివసేన నేత సంజయ్ రౌత్ ని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఆదివారం ఉదయం నుంచి ముంబైలోని ఆయన ఇంట్లో సోదాలు జరుపుతున్న వారు మధ్యాహ్నం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. రూ. 1,034 కోట్ల పత్రా చాల్ ల్యాండ్ స్కామ్ లో ఆయన ప్రమేయం ఉందని, ఈడీ ఇటీవల జారీ చేసిన సమన్లలో పేర్కొంది.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఉన్నందున తాను ఈడీ ముందు హాజరు కాలేనని సవాల్ చేసినప్పటికీ.. రౌత్ ని అధికారులు అరెస్టు చేశారు. బాలాసాహెబ్ ఠాక్రేపై ప్రమాణం చేసి చెబుతానని, ఈ కుంభకోణంతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పారు. ఏమైనా.. శివసేనను వీడబోనని, ఈడీపై పోరాటం చేస్తూనే ఉంటానని ఆయన ట్వీట్ చేశారు.

సంజయ్ రౌత్ మద్దతుదారులు ఆయన ఇంటివద్ద పెద్ద సంఖ్యలో చేరి.. ఈడీ, బీజేపీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఆయన నివాసం వద్ద ప్రభుత్వం భారీగా పోలీసులను మోహరించింది. గత ఏప్రిల్ లో ఈడీ... రౌత్ భార్య వర్ష రౌత్ కి, ఆయన ఇద్దరు సన్నిహితులకు చెందిన రూ. 11.15 కోట్ల విలువైన ఆస్తులను ఎటాచ్ చేసింది. సంజయ్ రౌత్ అరెస్టుకు ముందు తన నివాసంలో మీడియాతో మాట్లాడిన మాజీ సీఎం, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే.. రాష్ట్రంలో శివసేనను అంతం చేయడానికే బీజేపీ యత్నిస్తోందని ఆరోపించారు.

ఇదంతా పెద్ద కుట్ర అని, సేనను ఫినిష్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. దీన్ని ఎదుర్కోవడానికి తమవంతు యత్నాలు తాము చేస్తామన్నారు.

ఇదే సమయంలో గవర్నర్ భగత్ సింగ్ కొష్యరీని మళ్ళీ దుయ్యబట్టారు. తన వ్యాఖ్యల ద్వారా ముంబైని, మరాఠీలను అవమానపరిచిన ఆయనకు 'కొల్హాపురి చెప్పులను' చూపాలని ఉద్ధవ్ తీవ్రంగా కామెంట్ చేశారు. థానే నుంచి భారీ సంఖ్యలో తన నివాసానికి చేరుకున్న పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

First Published:  31 July 2022 8:20 PM IST
Next Story