Telugu Global
National

రూ.4,650 కోట్లు సీజ్.. ఈసీ చరిత్రలోనే రికార్డు

దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా రోజూ నగదు, మద్యం, మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది ఈసీ. మార్చి 1 నుంచి ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో రూ. 4,652 కోట్ల విలువైన సొత్తు రికవరీ చేసుకున్నట్లు స్పష్టం చేసింది.

రూ.4,650 కోట్లు సీజ్.. ఈసీ చరిత్రలోనే రికార్డు
X

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు అనేక ఎత్తుగడలు వేస్తుంటాయి. అందులో ప్రధానంగా నగదు, మద్యం పంపిణీ. వీటిని అరికట్టేందుకు ఎన్నికల సంఘం కూడా అదే స్థాయిలో ప్రయత్నాలు చేస్తుంటుంది. ఎన్నికల వేళ నగదు, మద్యం పంపిణీని అడ్డుకునేందుకు ఈసీ ప్రతి రాష్ట్రంలోనూ జనరల్ అబ్జర్వర్లతో పాటు పోలీస్ అబ్జర్వర్లను పెట్టి, ప్రభుత్వ యంత్రాంగంతో ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.


ఈ క్రమంలోనే దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా రోజూ నగదు, మద్యం, మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది ఈసీ. మార్చి 1 నుంచి ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో రూ. 4,652 కోట్ల విలువైన సొత్తు రికవరీ చేసుకున్నట్లు స్పష్టం చేసింది. అంటే దాదాపు రోజుకు రూ.100 కోట్లు రికవరీ చేసుకున్నట్లు లెక్క. ఇప్పటివరకూ పార్లమెంట్ ఎన్నికల చరిత్రలో ఇదే అత్యధిక రికవరీ.

మొత్తం రూ.4 వేల 650 కోట్లలో రూ.395.39 కోట్లు నగదు రూపంలో స్వాధీనం చేసుకోగా.. రూ.562.10 కోట్ల విలువైన బంగారం, వెండి సహా ఇతర విలువైన లోహాలు రికవరీ చేసినట్టు ఈసీ స్పష్టం చేసింది. ఇక రూ.489.31 కోట్ల విలువైన మద్యం సీజ్ చేసినట్లు ఈసీ వెల్లడించింది. గంజాయి, కొకైన్ లాంటి మాదక ద్రవ్యాలను కూడా ఈసీ పెద్ద మొత్తంలో సీజ్ చేసింది. మొత్తం రికవరీలో రూ.2 వేల 68 కోట్ల విలువైన డ్రగ్స్‌ ఉన్నట్లు లెక్క చెప్పింది ఈసీ. ఇప్పటివరకూ స్వాధీనం చేసుకున్నవాటిలో 45 శాతం వాటా డ్రగ్స్‌దే కావడం విశేషం. ఇక వీటితో పాటు రూ. 1,142 కోట్ల విలువైన టీవీలు, ఫ్రిడ్జ్‌లు, మొబైల్ ఫోన్లు.. లాంటివి స్వాధీనం చేసుకున్నామని ఈసీ వివరించింది.

First Published:  15 April 2024 5:04 PM IST
Next Story