రాహుల్‌కు ఈసీ నోటీసులు
ప్రధాన మంత్రి స్థాయి వ్యక్తిని జేబుదొంగ, చెడుశకునం(పనౌతి) అంటూ కామెంట్ చేయడం రాహుల్‌కు తగదని ఈసీకి ఫిర్యాదు చేసింది బీజేపీ.
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీకి ఎలక్షన్ కమిషన్ షాకిచ్చింది. ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలకు వివరణ కోరుతూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. బీజేపీ ఇచ్చిన ఫిర్యాదుతో రాహుల్‌కు నోటీసులు జారీ చేసినట్లు ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది.
ప్రధాన మంత్రి స్థాయి వ్యక్తిని జేబుదొంగ, చెడుశకునం(పనౌతి) అంటూ కామెంట్ చేయడం రాహుల్‌కు తగదని ఈసీకి ఫిర్యాదు చేసింది బీజేపీ. గత తొమ్మిదేళ్లలో బడా వ్యాపారవేత్తలకు కేంద్రం రూ.14 లక్షల కోట్లు మాఫీ చేసిందంటూ రాహుల్ చేసిన ఆరోపణలకు రుజువులు చూపడం లేదని బీజేపీ తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో రాహుల్‌గాంధీకి నోటీసులు జారీ చేసిన ఈసీ..ఈ నెల 25లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
ఈ నెల 21న రాజస్థాన్ బార్మెర్‌లో నిర్వహించిన బహిరంగసభలో పాల్గొన్న రాహుల్ గాంధీ..ప్రధాని మోదీని ఉద్దేశించి జేబు దొంగ ఎప్పుడూ ఒంటరిగా రాడు అని, ఆయన వెనుక ముగ్గురు వస్తారంటూ కామెంట్స్ చేశారు. ప్రజల దృష్టిని మరల్చడమే మోదీ పని అంటూ ఆరోపించారు. హిందూ - ముస్లిం, నోట్ల రద్దు, జీఎస్టీ వంటి అంశాలను లేవనెత్తుతూ ప్రజల దృష్టిని మోడీ మరలిస్తాడని, వెనుక నుంచి అదానీ వచ్చి డబ్బులు తీసుకెళ్తాడని రాహుల్ ఆరోపించారు. ఇక అహ్మదాబాద్‌లో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్‌కు చెడు శకునం-(పనౌతి) రావడం వల్లే ఇండియా ఓడిపోయిందంటూ మోడీని ఉద్దేశించి విమర్శలు చేశారు రాహుల్.
ఎవరినైనా జేబు దొంగ అని పిలవడం దుర్మార్గమైన చర్యగా బీజేపీ అభివర్ణించింది. ఇది వ్యక్తిగత దాడి అని, ప్రధాని మోడీ ప్రతిష్టకు భంగం కలిగించాలనే ఉద్దేశంతోనే రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారని ఆరోపించింది. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలోనూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
♦