జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ పై అనర్హతకు ఈసీ సిఫార్సు
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ను శాసన సభ్యుడిగా అనర్హుడిగా ప్రకటించాలని ఎన్నికల సంఘం గవర్నర్ కు సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన శాసనసభ్యత్వాన్ని రద్దు చేస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారంటూ పెద్ద ఎత్తున వార్తలు వెలువడ్డాయి.
జార్ఖండ్ రాష్ట్రం రాజకీయ సంక్షోభం దిశగా నడుస్తోంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ను శాసన సభ్యుడిగా అనర్హుడిగా ప్రకటించాలని ఎన్నికల సంఘం సిఫార్సు చేసింది. దీనిపై గవర్నర్ రమేష్ బయాస్ శుక్రవారంనాడు ఉత్తర్వులు జారీ చేయనున్నారని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. సోరెన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఈసీ సిఫార్సు మేరకు గవర్నర్ ఈ చర్యలు తీసుకోనున్నారు. ముఖ్యమంత్రి తనకు తానుగానే గనులను కేటాయించుకుని అధికారాన్ని దుర్వినియోగం చేశారంటూ రాష్ట్ర బిజెపి నేతలు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. దీనిని ఆయన ఎన్నికల సంఘానికి పరిశీలన కోసం పంపారు. దానిని పరిశీలించిన ఎన్నికల సంఘం ఆయన పదవికి అనర్హుడని పేర్కొంటూ అనర్హత వేటు వేయాలని గవర్నర్ కు నివేదిక ఇచ్చింది.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సోరేన్ శుక్రవారంనాడు తన ఇంటిలో యుపిఎ ఎమ్మెల్యేలతో చర్చలు జరిపిన కొన్ని గంటల్లోనే ఆయన శాసనసభ్యత్వాన్ని రద్దు చేస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారంటూ పెద్ద ఎత్తున వార్తలు వెలువడ్డాయి.
దీనిపై నిన్న ఢిల్లీలో ఉన్న గవర్నర్ మాట్లాడుతూ తాను రాష్ట్రానికి వెళ్ళిన తర్వాతే ఆ విషయాలు పరిశీలిస్తానని ఇప్పుడే చెప్పలేనని పేర్కొన్నారు. ఈ రోజు ఆయన ఎన్నికల సంఘం సిఫార్సు మేరకు సీఎం సోరెన్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్టు పేర్కొన్నారని వార్తలు వస్తున్నాయి. అయితే శాసనసభ సభ్యత్వం రద్దయినా.. సోరెన్ సీఎంగా కొనసాగవచ్చు. యూపీఏ మిత్రపక్షాలు ఆయనకు మద్దతు తెలిపితే సరిపోతుంది. అయితే మరో ఆరు నెలల్లోగా ఆయన శాసనసభకు తిరిగి ఎన్నిక కావాల్సి ఉంటుంది.
కాగా, ఇదంతా కొంతమంది జర్నలిస్టులతో కలిసి బిజెపి చేస్తున్న కుట్ర అని ముఖ్యమంత్రి సోరెన్ ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోయలేరని అన్నారు. ఈ విషయంలో తాము సుప్రీం కోర్టుకు వెళతామని జెఎంఎం వర్గాలు తెలిపాయి.
82 మంది సభ్యుల జార్ఖండ్ అసెంబ్లీలో, జెఎంఎం 30, కాంగ్రెస్ 16 తో కలిపి 46మంది సభ్యులు ఉన్నారు. ఇది మెజారిటీ మార్క్ కంటే కొంచెం ఎక్కువ. మరికొందరి మద్దతుతో పాటు. 25 మంది సభ్యులతో బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది.