Telugu Global
National

ఎగ్జిట్ పోల్స్‌పై ఈసీ నిషేధం.. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే..

ఎగ్జిట్ పోల్స్ నిర్వహించడం, వాటిని ప్రచురించడం, ప్రసారం చేయడంపై అన్ని టీవీ ఛానల్స్, మీడియా సంస్థలకు నిషేధం వర్తిస్తుందని తెలిపింది.

ఎగ్జిట్ పోల్స్‌పై ఈసీ నిషేధం.. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే..
X

తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం విధిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది. ఈ మేరకు కీలక ప్రకటన విడుదల చేసింది. ఐదు రాష్ట్రాలకు సంబంధించి డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. అయితే తెలంగాణలో జరిగే నవంబర్ 30 పోలింగ్ చివరి కానున్నది. దీంతో నవంబర్ 7వ తేదీ ఉదయం 7 గంటల నుంచి నవంబర్ 30వ తేదీ సాయంత్రం 6.30 గంటల వరకు ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయవద్దని ఎన్నికల సంఘం ఉత్తర్వుల్లో పేర్కొన్నది.

ఎగ్జిట్ పోల్స్ నిర్వహించడం, వాటిని ప్రచురించడం, ప్రసారం చేయడంపై అన్ని టీవీ ఛానల్స్, మీడియా సంస్థలకు నిషేధం వర్తిస్తుందని తెలిపింది. ఐదు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు జరుగుతున్నందు వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. ఛత్తీస్‌గఢ్‌లో నవంబర్ 7, 17వ తేదీల్లో పోలింగ్ జరుగనున్నది. మీజోరాంలో నవంబర్ 7, మధ్యప్రదేశ్‌లో నవంబర్ 17, రాజస్థాన్‌లో నవంబర్ 25, తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్ నిర్వహించనున్నారు.

దీంతో ఎన్నికల చట్టంలోని నిబంధనలు ఉటంకిస్తూ ఎగ్జిట్ పోల్స్ నిషేధించినట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించే ఏ వ్యక్తికి అయినా రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించబడతాయని ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్‌లో పేర్కొన్నది. ఈ నిషేధ ఉత్తర్వులు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మరియు ఇతర మీడియాలకు కూడా వర్తిస్తుందని.. ఏ మాధ్యమం ద్వారా కూడా ఎగ్జిట్ పోల్స్ ప్రసారం చేయడం, ప్రచురించడం నిషేధించినట్లు స్పష్టం చేసింది.

First Published:  1 Nov 2023 9:18 AM IST
Next Story