ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం.. ఢిల్లీని తాకిన ప్రకంపనలు
ఆఫ్ఘనిస్తాన్‌లోని ఫైజాబాద్‌లో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకటించింది. అక్కడ భూకంప తీవ్రత 6.3గా నమోదైనట్లు అధికారులు తెలిపారు.
ఉత్తర భారత దేశాన్ని భూకంపం వణికించింది. గురువారం మధ్యాహ్నం రాజధాని నగరంతోపాటు సమీప ప్రాంతాల్లో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.1గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. ఢిల్లీతోపాటు పంజాబ్, చండీగఢ్, జమ్మూకశ్మీర్ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో సుమారు 30 సెకన్లపాటు భూమి కంపించింది. దీంతోపాటు జమ్మూకశ్మీర్‌లోని పూంఛ్ జిల్లా, దక్షిణ పీర్ పంజాల్ ప్రాంతాల్లోనూ భూకంప తీవ్రత కనిపించినట్లు అక్కడి వారు తెలిపారు. భూ ప్రకంపనల ధాటికి జమ్మూ కాశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడినట్లు తెలుస్తోంది.
ఆఫ్ఘనిస్తాన్‌లోని ఫైజాబాద్‌లో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకటించింది. అక్కడ భూకంప తీవ్రత 6.3గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ భారీ భూకంపం వల్లే పాకిస్తాన్‌లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నట్టు పాక్ నేషనల్ మీడియా జియో న్యూస్ వెల్లడించింది. లాహోర్, ఇస్లామాబాద్, ఖైబర్ ఫఖ్తుఖ్వా సహా పలు ప్రావిన్స్‌లలో భూ ప్రకంపనలు నమోదైనట్లు తెలిపింది. భూ ప్రకంపనల ధాటికి తీవ్ర భయాందోళనకు గురైన ప్రజలు.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రాణ, ఆస్తినష్టం గురించి ఇప్పటి వరకు ఎలాంటి నివేదికలు వెలువడలేదు. నిన్న బుధవారం కూడా కూడా ఆఫ్ఘనిస్తాన్‌లో 4.1 తీవ్రతతో భూమి కంపించింది.
సాధారణంగా ఆసియా ఖండంలో భూకంపాలు ఎక్కువగా వస్తుంటాయి. భారత్ లోని జమ్మూ కశ్మీర్, పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్, తజకిస్తాన్ లు హింద్ కుష్ హిమాలయన్ జోన్ కు చుట్టుపక్కల వీటి కేంద్రాలు ఉంటాయి. యూరేషియా ఫలకంతో భారత ఉపఖండ భూఫలకం ఢీకొనడమే దీనికి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు.