Telugu Global
National

మద్యం మత్తులో ఫ్లైట్ ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేసేందుకు ప్రయాణికుడి ప్రయత్నం

ఢిల్లీ నుంచి బెంగళూరుకు వెళ్తున్న విమానం 6ఈ 308లో ఓ ప్రయాణికుడు ఫుల్లుగా మద్యం సేవించాడు. మద్యం మత్తులో ఏం చేస్తున్నాడో తెలియనిస్థితిలో విమాన ఎమర్జెన్సీ డోర్‌ను తెరిచే ప్రయత్నం చేశాడు.

మద్యం మత్తులో ఫ్లైట్ ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేసేందుకు ప్రయాణికుడి ప్రయత్నం
X

ఈమధ్య విమానాలు ఒకప్పటి ఆర్టీసీ బస్సులను తలపిస్తున్నాయి. ఆర్టీసీ బస్సులో సీటు కోసం ఒకరినొకరు కొట్టుకునే పరిస్థితి ఉండేది. పక్కన కూర్చున్న వారిపై కొంతమంది ఉమ్మి కూడా వేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి విమానాల్లో కనిపిస్తోంది. తాగి పక్కన ఉన్న వాళ్లపై మూత్రం పోయడం, సీటు నాదంటే నాదని పిడి గుద్దులు గుద్దుకోవడం కనిపిస్తోంది. ఇలా ఒకటి రెండు సంఘటనలు కాదు.. కొద్ది రోజులుగా విమానాల్లో తరచూ ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి.

తాజాగా ఇండిగో ఎయిర్ లైన్స్‌ విమానంలో ఫుల్లుగా మద్యం తాగిన ఓ ప్రయాణికుడు విమానం ఎమర్జెన్సీ డోర్‌ను ఓపెన్ చేసే ప్రయత్నం చేశాడు. సమయానికి విమాన సిబ్బంది గమనించి అతడి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ఇండిగో ఎయిర్ లైన్స్ తెలిపిన వివరాల మేరకు.. ఢిల్లీ నుంచి బెంగళూరుకు వెళ్తున్న విమానం 6ఈ 308లో ఓ ప్రయాణికుడు ఫుల్లుగా మద్యం సేవించాడు. మద్యం మత్తులో ఏం చేస్తున్నాడో తెలియనిస్థితిలో విమాన ఎమర్జెన్సీ డోర్‌ను తెరిచే ప్రయత్నం చేశాడు.

అయితే విమాన సిబ్బంది సమయానికి గుర్తించి అతడిని అడ్డుకున్నారు. విషయాన్ని విమానం కెప్టెన్ దృష్టికి తీసుకువెళ్లడంతో అతడు తగిన హెచ్చరికలు చేసి ప్రయాణికుడిని తిరిగి సీట్లో కూర్చోబెట్టాడు. విమానం బెంగళూరులో ల్యాండ్ అయిన తర్వాత ఎమర్జెన్సీ డోర్‌ను ఓపెన్ చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తిని సీఐఎస్‌ఎఫ్ అధికారులకు అప్పగించినట్లు విమాన సిబ్బంది తెలిపారు.

ఇటీవల ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణికులు తాగి రచ్చ చేయడం కనిపించింది. దీంతో ఆ సంస్థ తమ విమానాల్లో ప్రయాణించేవారికి కొంత మోతాదులోనే మద్యం అందించాలని నిర్ణయం తీసుకుంది. విమానాల్లో తాగి ప్రయాణికులు చేస్తున్న రచ్చ చూస్తుంటే ముందు ముందు అన్ని విమాన సంస్థలు ఎయిర్ ఇండియా సంస్థ అనుసరిస్తున్న నిబంధనను పాటించే అవకాశం కనిపిస్తోంది.

First Published:  8 April 2023 2:18 PM IST
Next Story