పెళ్లి కోసం 28 కిలోమీటర్ల నడక..! - ఒడిశాలో వరుడి కుటుంబానికి వింత అనుభవం
తెల్లవారితే పెళ్లి.. ఆ ఊరికి వెళ్లాలంటే 28 కిలోమీటర్ల దూరం. మరి వాహనాలు లేకపోతే వెళ్లేది ఎలా.. అని తర్జనభర్జన పడ్డారు వరుడు కుటుంబ సభ్యులు.
పెళ్లి కోసం వరుడి కుటుంబ సభ్యులు 28 కిలోమీటర్లు నడిచి వెళ్లారు. ఏకంగా రాత్రంతా నడిచి పెళ్లి ముహూర్తానికి చేరుకున్నారు. పెద్దలు నిశ్చయించిన ముహూర్తానికే వధువు మెడలో వరుడు తాళి కట్టాడు. ఈ వింత ఘటన ఒడిశా రాష్ట్రంలోని రాయగడ జిల్లాలో జరిగింది.
కల్యాణ్‌సింగ్‌పూర్ గ్రామానికి చెందిన యువకుడికి, దిబలపాడు గ్రామానికి చెందిన యువతితో పెద్దలు వివాహం నిశ్చయం చేశారు. శుక్రవారం ఉదయం పెళ్లి చేయాలని ముహూర్తం ఫిక్స్ చేశారు. వరుడి కుటుంబసభ్యులు పెళ్లికి అన్ని ఏర్పాట్లూ చేసుకున్నారు. ఇందుకోసం వాహనాలు కూడా బుక్ చేసుకున్నారు.
గురువారం సాయంత్రం పెళ్లికి బయలుదేరే సమయంలో వారు బుక్ చేసుకున్న వాహనాల యజమానులు వాటిని రద్దు చేసుకున్నారు. దీనికి కారణం తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ వాహనదారులు ఒడిశాలో బుధవారం నుంచి ఉద్యమిస్తుండటమే. ఈ ఆందోళన గురువారం సాయంత్రానికి కూడా విరమించకపోవడంతో చేసేది లేక పెళ్లి వారు బుక్ చేసుకున్న వాహనాలను వాటి యజమానులు రద్దు చేసుకున్నారు.
తెల్లవారితే పెళ్లి.. ఆ ఊరికి వెళ్లాలంటే 28 కిలోమీటర్ల దూరం. మరి వాహనాలు లేకపోతే వెళ్లేది ఎలా.. అని తర్జనభర్జన పడ్డారు వరుడు కుటుంబ సభ్యులు. ఆఖరికి ఎట్టి పరిస్థితుల్లోనూ ముహూర్తం సమయానికి పెళ్లి జరగాల్సిందేనని నిశ్చయించుకొని.. నడిచే ఆ ఊరికి బయలుదేరారు. గురువారం సాయంత్రం బయలుదేరిన వీరు శుక్రవారం ఉదయానికి వధువు ఇంటికి చేరుకున్నారు. పెళ్లి కూడా ఘనంగా జరిగింది. అయితే.. తిరిగి వెళ్లడమెలా అనే సమస్య వారికి ఎదురైంది. చేసేది లేక వధువు ఇంటి వద్దే ఉండిపోయారు.
వాహనదారుల సమ్మె విరమించిన తర్వాతే అక్కడినుంచి వెళ్లాలని నిశ్చయించుకున్నారు. ఇప్పుడు వారి పరిస్థితి నటుడు విశ్వక్‌సేన్ సినిమా.. `అరణ్యవాసంలో అర్జున కల్యాణం`ను గుర్తు చేయడంలో ఆశ్చర్యం లేదు కదూ. ఆ చిత్ర కథలోనూ వరుడిగా నటించిన హీరో కుటుంబ పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. కోవిడ్ లాక్‌డౌన్ వల్ల వారు వధువు ఇంట్లోనే ఉండిపోవాల్సి వస్తుంది.
మరోపక్క వాహనదారుల సమ్మెను తమ డిమాండ్లు పరిష్కరించే వరకు కొనసాగిస్తామని `ది డ్రైవర్ ఏక్తా మహాసంఘ్` స్పష్టం చేసింది. నిరసనలు విరమించుకోవాలని ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ పీకే జెనా, డీజీపీ ఎస్‌కే బన్సక్ కోరినా ఫలితం కనిపించడం లేదు.