జాతీయ జెండాలను అడ్డదిడ్డంగా చేసేశారు
కొన్నింటికి కుట్టు సరిగా లేకపోవడం, మరి కొన్నింటికి కటింగ్ లోపాలు ఉన్నాయి, ఇంకొన్నింటికి అశోక చక్రం సరైన స్థలంలో లేదు. మరి కొన్ని త్రివర్ణ పతాకాల్లో కాషాయ, తెలుపు, ఆకుపచ్చ రంగులు సమానంగా లేవు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఘనంగా నిర్వహించాలని హర్ ఘర్ తిరంగా అంటూ ఆర్భాటంగా ప్రచారం చేయడమేగానీ చిత్తశుద్ధి లేదని తేలుతోంది. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రంలోనే జాతీయ జెండాకు అవమానం జరిగింది. జాతీయ జెండాల రూపకల్పనలో అనేక లోపాలు ఉన్నప్పటికీ పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ప్రతీ ఇంటిపైన జాతీయ జెండా ఎగరేయాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఇందు కోసం 11 కంపెనీలకు జాతీయ జెండాల తయారీకి ఆర్డర్లు ఇచ్చారు. వీటిలో 7 కంపెనీలు గుజరాత్ లోనే ఉన్నాయి. ఇప్పుడు ఆ రా ష్ట్రం నుంచి తయారై వచ్చిన జాతీయ జెండాలలో అనేక లోపాలున్నాయి. జెండా నిబంధనలకు విరుద్ధంగా తయారయ్యాయి. దాదాపు 30వేలకు పైగా ఈ లోప భూయిష్ట పాలిస్టర్ జెండాలు కర్ణాటక లోని పోస్టాఫీస్ లకు పంపిణీ కోసం వచ్చాయి.
'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' కింద 'హర్ ఘర్ తిరంగా' ప్రచారంలో భాగంగా వచ్చిన చాలా జెండాలు విక్రయించదగిన స్థితిలో లేవని వార్తలు వస్తున్నాయి. గుజరాత్‌లోని వివిధ విక్రేతల నుంచి వచ్చిన వేలాది పాలిస్టర్ జెండాలు నాసిరకంగా ఉన్నట్లు సమాచారం. కొన్నింటికి కుట్టు సరిగా లేకపోవడం, మరి కొన్నింటికి కటింగ్ లోపాలు ఉన్నాయి, ఇంకొన్నింటికి అశోక చక్రం సరైన స్థలంలో లేదు. మరి కొన్ని త్రివర్ణ పతాకాల్లో కాషాయ, తెలుపు, ఆకుపచ్చ రంగులు సమానంగా లేవు. పతాక నిర్దేశిత పరిమాణం 3:2 నిష్పత్తికి అనుగుణంగా లేవని తెలుస్తోంది.
ఇలా లోపభూయిష్టంగా ఉన్న జెండాలను అమ్మవద్దని తమకు ఆదేశాలు వచ్చాయని మంగళూరులోని పోస్టాఫీస్ ఉద్యోగి ఒకరు చెప్పారు. విక్రయించేప్పుడు వాటిని చెక్ చేయాలని అన్ని పోస్టాఫీసులకు ఆదేశాలు వెళ్ళాయి. కానీ ఇప్పటికే రిటైల్ అమ్మకం దారులు పెద్ద ఎత్తున జెండాలను కొనుక్కొని వెళ్ళారు. ఎవరైనా లోపాలు గుర్తించి వాటిని తిరిగి వెనక్కి తీసుకొస్తే వారికి తప్పనిసరిగా సక్రమంగా ఉన్న జెండాలను ఇవ్వగలం తప్ప తామేమీ చేయలేమని చేతులెత్తేశారు.
స్వాతంత్ర్య దినోత్సవం ముందు రోజు వరకూ కార్యాలయాలు తెరిచే ఉంచాలని దక్షిణ కర్నాటక ప్రాంతంలోని పోస్టాఫీసులకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. రానున్న రోజుల్లో లోపాలతో ఉన్న జెండాలను మార్చుకునేందుకు భారీగా ప్రజలు వచ్చే అవకాశం ఉందన్న అంచనాతో ఈ ఆదేశాలు జారీ చేశారు. ఇటీవలే మధ్యప్రదేశ్ లోని బీజేపీ కార్యాలయాలన్నింటిలో జాతీయ జెండాల సేల్స్ కౌంటర్లు ప్రారంభించి విమర్శల పాలైన సంగతి తెలిసిందే.