కోర్టులను కాషాయమయం కాకుండా కాపాడుకుందాం -కపిల్ సిబాల్
లోపాలున్నప్పటికీ న్యాయ వ్యవస్థను ప్రభుత్వ చేతుల్లో పెట్టడం కన్నా కొలీజియం వ్యవస్థ ఉండటమే మేలన్నారు సిబాల్ . ప్రతీదీ ప్రభుత్వ నియంత్రణలో ఉండడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. న్యాయవ్యవస్థను కూడా ఆక్రమించుకొని 'సొంత జడ్జీ'లను నియమించుకోవాలని ప్రభుత్వం భావిస్తోందని ఆయన ఆరోపించారు.
దేశం లోని అన్ని వ్యవస్థలను కేంద్ర బీజేపీ సర్కార్ కాషాయమయం చేసేస్తున్నదని కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ మండిపడ్డారు. చివరకు కోర్టులను కూడా కాషాయమయం చేయాలని ఎత్తుగడలు వేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. ఓ ప్రైవేటు న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ...
''విశ్వవిద్యాలయాల వైస్‌ఛాన్సలర్లుగా సొంత మనుషులు ఉన్నారు. రాష్ట్రాల్లో గవర్నర్లుగా భజనపరులు ఉన్నారు. ఎన్నికల కమిషన్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఈడీ, సీబీఐ, ఇన్‌కం ట్యాక్స్ అన్ని చోట్లా సొంతవారే ఉన్నారు. ఇప్పుడు సొంత మనుషులనే జడ్జీలుగా నియమించుకోవాలని చూస్తోంది'' అని సిబాల్ ఆరోపించారు.
కొలీజియం వ్యవస్థ గురించి ప్రభుత్వానికి, న్యాయ వ్యవస్థకు మధ్య జరుగుతున్న వివాదంపై సిబాల్ స్పందిస్తూ , కొలీజియం వ్యవస్థ సంపూర్ణమైనదేమీ కాదని, పారదర్శకత లేకపోవడం, సన్నిహితులను నియమించుకోవడం వంటి లోపాలు కొలీజియం వ్యవస్థలో ఉన్నాయని అన్నారు. నియామక అధికారాలు సుప్రీంకోర్టు చేతిలో ఉండడంతో హైకోర్టు జడ్జీలు కూడా సర్వోన్నత న్యాయస్థానాన్ని సంతృప్తి పరచడానికి ప్రయత్నిస్తుంటారని అన్నారు. అందువల్ల హైకోర్టుల స్వతంత్రతపై ప్రభావం పడుతుందని చెప్పారు. ఇది మంచిది కాదని అన్నారు.
ఇలాంటి లోపాలున్నప్పటికీ న్యాయ వ్యవస్థను ప్రభుత్వ చేతుల్లో పెట్టడం కన్నా కొలీజియం వ్యవస్థ ఉండటమే మేలన్నారు సిబాల్. ప్రతీదీ ప్రభుత్వ నియంత్రణలో ఉండడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.న్యాయవ్యవస్థను కూడా ఆక్రమించుకొని 'సొంత జడ్జీ'లను నియమించుకోవాలని ప్రభుత్వం భావిస్తోందని ఆయన ఆరోపించారు. న్యాయ వ్యవస్థపై కేంద్రం ఏకపక్షంగా దాడులు చేస్తోందని ఆరోపించిన సిబాల్ కొలీజియం వ్యవస్థపై కేంద్ర న్యాయమంత్రి కిరెన్ రిజుజు బహిరంగంగా విమర్శలు చేయడాన్ని ఖండించారు. నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్‌మెంట్స్ కమిషన్ ఏర్పాటును సుప్రీంకోర్టు తిరస్కరించడం కేంద్ర ప్రభుత్వానికి ఆమోదయోగ్యం కాకపోతే రివ్యూ పిటిషన్ వేసి ఉండాల్సిందని అంతే కానీ దాడులకు పూనుకోవడం ఏం ప్రజాస్వామ్యం అని ఆయన ప్రశ్నించారు. .
న్యాయవ్యవస్థ స్వతంత్రంగా ఉండటం ఈ వ్యవస్థకు చాలా అవసరమని, ఆ స్వతంత్రతను కోల్పోకూడదని కపిల్ సిబాల్ వ్యాఖ్యానించారు.