పొలిటికల్ సీన్ లో చిన్నారులు.. ఈసీ మార్గదర్శకాలు
ప్రచార పర్వంలో పిల్లల్ని భాగస్వాముల్ని చేస్తున్న రాజకీయ పార్టీలకు ఈసీ హెచ్చరికలు పంపింది.
చిన్న పిల్లల చేతిలో రాజకీయ పార్టీల జెండాలు పెట్టి ఫొటోలు తీయడం, అభిమామ నాయకులకు పిల్లలతో జేజేలు పలికించి మురిసిపోవడం, వారికి పార్టీ గుర్తులున్న రిబ్బన్లు కట్టడం.. ఇలాంటివన్నీ ఇకపై చెల్లవు. పార్టీ మీటింగ్ లకు పిల్లల్ని తీసుకెళ్లడం, స్టేజ్ పై పిల్లలతో రాజకీయ వ్యాఖ్యలు చేయించడం కూడా నిబంధనలకు విరుద్ధమే. ఇప్పటి వరకూ ఇలాంటివి అక్కడక్కడా జరిగాయి కానీ, ఇకపై జరగడానికి వీల్లేదంటూ కేంద్ర ఎన్నికల సంఘం కఠిన ఆదేశాలిచ్చింది. ప్రచార పర్వంలో పిల్లల్ని భాగస్వాముల్ని చేస్తున్న రాజకీయ పార్టీలకు ఈసీ హెచ్చరికలు పంపింది.
పొలిటికల్ సీన్ లోకి పిల్లలు వద్దు..
పోస్టర్లు అతికించడం, కరపత్రాలు పంచడం, ర్యాలీల్లో నినాదాలు ఇప్పించడం.. ఇలాంటి ప్రచార కార్యక్రమాలకు చిన్న పిల్లలను వాడుకోవద్దని రాజకీయ పార్టీలకు ఈసీ స్పష్టం చేసింది. ఎన్నికల సంబంధ పనులు, కార్యక్రమాల్లో పార్టీలు పిల్లలను వాడుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని చెప్పింది. ఈమేరకు రాష్ట్రాల ఎన్నికల అధికారులు, పోలింగ్ సిబ్బందికి కూడా మార్గదర్శకాలు జారీ చేసింది. బాల కార్మిక చట్టాలు కచ్చితంగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత జిల్లా ఎలక్షన్ ఆఫీసర్, రిటర్నింగ్ ఆఫీసర్ లదేనని స్పష్టం చేసింది ఈసీ. క్షేత్రస్థాయిలో ప్రత్యేకంగా ఈ బాధ్యతలు నెరవేర్చాలి చెప్పింది.
నేతలూ బహుపరాక్..
ఎన్నికల బరిలో దిగిన నేతలు ప్రచార పర్వంలో రకరకాల విన్యాసాలు చేస్తుంటారు. చిన్న పిల్లల్ని దగ్గరకు తీసుకోవడం, వారిని ఎత్తుకుని ముద్దాడటం, వారితో కలసి ఊరిలో ప్రచారం నిర్వహించడం.. మనం చూస్తూనే ఉన్నాం. ఇకపై ఇలాంటివి చెల్లవు. ప్రచారంలో నేతలు చిన్నారులను ఎత్తుకుని ముద్దాడటం, పైకెత్తి అభివాదంచేయడం, వాహనాలు, ర్యాలీల్లో వారిని వెంట బెట్టుకుని తిరగడం వంటివి చేయకూడదని ఈసీ స్పష్టం చేసింది. ఎన్నికల సంబంధ కార్యకలాపాల్లో మైనర్లను వినియోగించవద్దని, ఒకవేళ కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తే విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని ఈసీ రాజకీయ పార్టీలను హెచ్చరించింది.