సినిమాల గురించి అనవసరంగా మాట్లాడకండి... బీజేపీ నేతలకు మోడీ హితవు
మంగళవారం ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం చివరి రోజున మోడీ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. బిజెపిలోని ప్రతి ఒక్కరూ పార్టీ అభివృద్ధి ఎజెండాపై కష్టపడి పనిచేస్తారని, కొంతమంది మాత్రం సినిమాలపై అనవసర వ్యాఖ్యలు చేస్తారని, దాంతో మొత్తం కథ మారుతుందని అన్నారు.
ఇటీవల విడుదలవుతున్న, విడుదలైన పలు సినిమాలపై బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. త్వరలో విడుదల కానున్న పఠాన్ మూవీపై, గతంలోనే రిలీజై విజయవంతంగా నడిచిన ఆర్ ఆర్ ఆర్ మూవీపై బీజేపీ నాయకులు విమర్శలు చేయడమే కాక మూవీ నడవనివ్వబోమని హెచ్చరికలు కూడా జారీ చేశారు.
RRR మూవీ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు అందులో ఎన్టీఆర్ తలపై ముస్లింలు పెట్టుకునే టోపీ పెట్టు కోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆ సీన్లు తీసేయకపోతే ఆ సినిమాను ఆడనివ్వబోమంటూ హెచ్చరించారు. ఇప్పుడు షారూఖ్ ఖాన్ , దీపికా పదుకొనే హీరో, హీరోయిన్లుగా వస్తున్న పఠాన్ మూవీపై కూడా బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున దాడి చేస్తున్నారు. ఆ మూవీలోని ఓ పాటలో దీపికా పదుకొనే వేసుకున్న బికినీ కాషాయ రంగులో ఉండటాన్ని బీజేపీ నాయకులు తప్పుబడుతున్నారు.
మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా అయితే ఆ మూవీని మధ్యప్రదేశ్ లో బ్యాన్ చేస్తామంటూ హెచ్చరించారు. అనేక మంది బీజేపీ నాయకులు సోషల్ మీడియాలో ఆ మూవీపై విరుచుకపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ నిన్న మాట్లాడిన మాటలు ఆ నాయకులందరికీ షాక్ ఇచ్చాయి.
మంగళవారం ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం చివరి రోజున ఆయన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. బిజెపిలోని ప్రతి ఒక్కరూ పార్టీ అభివృద్ధి ఎజెండాపై కష్టపడి పనిచేస్తారని, కొంతమంది మాత్రం సినిమాలపై అనవసర వ్యాఖ్యలు చేస్తారని, దాంతో మొత్తం కథ మారుతుందని, మీడియా సినిమాల మీద చేసిన వ్యాఖ్యలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని, టీవీలు రోజంతా అవే మాటలను ప్రసారం చేస్తాయని మోడీ అన్నారు.ఇకపై ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని పార్టీ నేతలకు ఆయన సూచించారు. సినిమాలపై అనవసర వ్యాఖ్యలు చేసి ప్రచారంలో ఉండొద్దని హితవు పలికారు.