Telugu Global
National

'క్రిమినల్స్'ను టీవీ ఛానల్ చర్చలకు పిలవొద్దు : కేంద్రం ఆదేశాలు

ఖలిస్తాన్ వేర్పాటు వాదానికి మద్దతు ఇచ్చే సిఖ్స్ ఫర్ జస్టిస్ అనే నిషేధిత సంస్థ చీఫ్ గుర్‌పత్వంత్ సింగ్ పన్ను ఒక టీవీ ఛానల్ చర్చకు పిలిచింది.

క్రిమినల్స్ను టీవీ ఛానల్ చర్చలకు పిలవొద్దు : కేంద్రం ఆదేశాలు
X

తీవ్రమైన క్రిమినల్ ఆరోపణలు ఉన్నవారిని, తీవ్రవాదులుగా ముద్రపడిన వ్యక్తులను టీవీ చర్చలకు పిలవొద్దని కేంద్ర ప్రభుత్వం మీడియాను ఆదేశించింది. అలాంటి వ్యక్తులకు టీవీల్లో గానీ, ఇతర మీడియాల్లో గానీ తమ వాయిస్‌ను వినిపించే అవకాశం ఇవ్వడం వల్ల.. శాంతి భద్రతలకు, దేశ సార్వభౌమత్వానికి విఘాతం కలుగుతుందని తెలిపింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ గురువారం ఆదేశాలు జారీ చేసింది.

ఖలిస్తాన్ వేర్పాటు వాదానికి మద్దతు ఇచ్చే 'సిఖ్స్ ఫర్ జస్టిస్' అనే నిషేధిత సంస్థ చీఫ్ గుర్‌పత్వంత్ సింగ్ పన్నును ఒక టీవీ ఛానల్ చర్చకు పిలిచింది. ఒక ప్రైవేట్ న్యూస్ ఛానల్ ఆయనతో డిబేట్ నిర్వహించింది. దీనిపై కేంద్రానికి పలు ఫిర్యాదులు అందాయి. వెంటనే స్పందించిన కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది.

తీవ్రమైన నేరాలు చేసిన వారు, టెర్రరిజానికి మద్దతు ఇచ్చే వ్యక్తులు, టెర్రరిస్టు గ్రూపులతో సంబంధాలు ఉన్న వ్యక్తులను టీవీ డిబేట్లలో భాగస్వామ్యం చేయవద్దని చెప్పారు. ఒక టీవీ ఛానల్ పన్నును చర్చకు పిలవగా.. భారత సార్వభౌమత్వానికి విఘాతం కలిగించేలా అనేక విషయాలు మాట్లాడారని కేంద్రం గుర్తించింది. దేశ భద్రతకు, ఇతర దేశాలతో ఉన్న స్నేహ బంధాలను పాడు చేసేలా ఆయన మాటలు ఉన్నాయని కేంద్రం చెబుతోంది. దేశ శాంతి భద్రతలకు, సామాన్య ప్రజలకు ప్రమాదకరంగా ఉన్నాయని కేంద్రం స్పష్టం చేసింది.

ఆర్టికల్ 19(2) ప్రకారం వాక్ స్వాతంత్రానికి ఈ ఉత్తర్వులు ఎలాంటి ఆటంకాలు కలిగించడం లేదని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ చెప్పింది. అదే సమయంలో ప్రతీ మీడియా సంస్థ, వ్యక్తులు తమ వాక్ స్వాతంత్రం ద్వారా.. దేశ చట్టాలను ఉల్లంఘించకూడదని సూచించింది. మీడియా సంస్థలు స్వీయ నియంత్రణ పాటించి.. ఇలాంటి వ్యక్తులను ఇకపై డిబేట్లకు పిలవ వద్దని సూచించింది.

First Published:  22 Sept 2023 11:29 AM IST
Next Story