Telugu Global
National

మతపరమైన ఊరేగింపులను అల్లర్లతో సమానంగా చూడొద్దు : సుప్రీం కోర్టు

మతపరమైన ఊరేగింపులను నియంత్రించేందుకు ప్రామాణిక విధానం ఉండాల‌ని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. అటువంటి ఊరేగింపులన్నీ మతపరమైన అల్లర్లకు దారితీయవని కోర్టు స్ప‌ష్టం చేసింది.

మతపరమైన ఊరేగింపులను అల్లర్లతో సమానంగా చూడొద్దు : సుప్రీం కోర్టు
X

మ‌త‌ప‌ర‌మైన ఊరేగింపుల‌న్నీ మ‌త‌ఘ‌ర్ష‌ణ‌లు, అల్ల‌ర్ల‌కు దారితీయ‌వ‌ని సుప్రీం కోర్టు శుక్ర‌వారంనాడు పేర్కొంది. ప్రతి మతపరమైన ఊరేగింపూ మతపరమైన అల్లర్లకు దారి తీస్తుందనే ఆలోచనా ధోరణి విడ‌నాడాలని కోర్టు వ్యాఖ్యానించింది. మతపరమైన పండుగల వల్ల దేశంలో జరిగే మంచిని చూడాలని పిటిషనర్ కు సూచించింది.

మతపరమైన ఊరేగింపులను నియంత్రించేందుకు ప్రామాణిక విధానం ఉండాల‌ని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) ను కొట్టివేసింది. అటువంటి ఊరేగింపులన్నీ మతపరమైన అల్లర్లకు దారితీయవని సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసింది. "గణేష్ పూజ సమయంలో మహారాష్ట్రలో లక్షల మంది గుమిగూడుతుంటారు. కానీ ఎప్పుడూ అల్లర్లు జరగలేదు క‌దా " అని కోర్టు పేర్కొంది.

సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ డి.వై. చంద్రచూడ్, జస్టిస్ పి.ఎస్. నరసింహులు ధ‌ర్మాస‌నం ఈ పిటిష‌న్ ను విచారించింది. ఇది రాష్ట్రాల‌కి సంబంధించినది కాబట్టి న్యాయపరంగా నిర్వహించదగినది కాదంటూ పిల్‌ను స్వీకరించడానికి కోర్టు నిరాకరించింది,

పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సి.యు. సింగ్ వాద‌న‌లు వినిపిస్తూ..మతపరమైన ఊరేగింపులు, సమావేశాల సమయంలో సంభవించే అల్లర్లను అడ్డుకోడానికి సుప్రీం కోర్టు మాత్రమే ఏదైనా చేయగలదని అన్నారు. కొన్నిసార్లు, మతపరమైన ఊరేగింపులు కత్తులు వంటి ఆయుధాలతో కూడా జ‌రుపుతుంటార‌ని ఆయన వాదించారు. ఆయ‌న వాద‌న‌ను తొసిపుచ్చుతూ..ఈ పిల్ ను కొట్టేస్తూ రాష్ట్రాల‌లో ఉన్న ప్ర‌బుత్వ‌, పోలీసు వ్య‌వ‌స్థ‌లు ఈ విష‌యాల‌ను చూసుకుంటాయ‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది.

First Published:  10 Dec 2022 2:43 AM GMT
Next Story