Telugu Global
National

ఆధార్‌పై ఆ రూమర్లు నమ్మొద్దు.. - ఉడాయ్‌ క్లారిటీ

కనీసం పదేళ్లకోసారి ఆధార్‌లోని సమాచారాన్ని అప్‌డేట్‌ చేసుకోవడం ద్వారా పౌరుల సమాచారం సీఐడీఆర్‌ వద్ద ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతూ ఉంటుందని వివరించింది.

ఆధార్‌పై ఆ రూమర్లు నమ్మొద్దు.. - ఉడాయ్‌ క్లారిటీ
X

ఆధార్‌ కార్డులకు సంబంధించి ఇటీవల జరుగుతున్న రూమర్లను నమ్మొద్దని ఉడాయ్‌ (భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ) తెలిపింది. జూన్‌ 14 లోపు వ్యక్తిగత వివరాలు అప్డేట్‌ చేయకపోతే ఆధార్‌ కార్డు పనిచేయదంటూ జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేసింది. ఆధార్‌లో వివరాలను ఉచితంగా సవరించుకోవడానికి మాత్రమే జూన్‌ 14 వరకు గడువని క్లారిటీ ఇచ్చింది. మార్చుకోకపోయినా ఆధార్‌ పనిచేస్తుందని స్పష్టం చేసింది. జూన్‌ 14 తర్వాత కూడా వివరాలు మార్చుకునేందుకు అవకాశం ఉంటుందని, అయితే అందుకు గాను నిర్దేశిత రుసుము చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.

ఆధార్‌లోని వివరాలను ఉచితంగా ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ చేసుకునేందుకు ఉడాయ్‌ తొలుత 2023 డిసెంబర్‌ 14 వరకు అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత దానిని రెండు దఫాల్లో జూన్‌ 14 వరకు పొడిగించింది. ఆలోపు ఆన్‌లైన్‌లో తగిన పత్రాలు సమర్పించి ఉచితంగా వివరాలు అప్‌డేట్‌ చేసుకోవచ్చు. ఆధార్‌ కార్డు కోసం పేరు నమోదు చేసుకున్న నాటి నుంచి పదేళ్లు పూర్తయినవారు వివరాలను అప్‌డేట్‌ చేసుకోవాలని ఉడాయ్‌ గతంలో సూచించింది.

కనీసం పదేళ్లకోసారి ఆధార్‌లోని సమాచారాన్ని అప్‌డేట్‌ చేసుకోవడం ద్వారా పౌరుల సమాచారం సీఐడీఆర్‌ వద్ద ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతూ ఉంటుందని వివరించింది. తద్వారా కచ్చితమైన సమాచారం నిక్షిప్తమవడానికి దోహదం చేస్తుందని తెలిపింది. టీసీ, మార్క్‌ షీట్, పాన్‌/ఇ–పాన్, డ్రైవింగ్‌ లైసెన్స్‌ వంటివి గుర్తింపు ధ్రువీకరణ పత్రంగా.. విద్యుత్, నీటి, గ్యాస్, టెలిఫోన్‌ బిల్లులను (మూడు నెలలకు మించని) చిరునామా ధ్రువీకరణ పత్రంగా ఉపయోగించుకోవచ్చని ఉడాయ్‌ పేర్కొంది. ధ్రువీకరణ పత్రాలను స్కాన్‌ చేసి ’మై ఆధార్‌’ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుందని తెలిపింది.

First Published:  27 May 2024 9:10 AM IST
Next Story