Telugu Global
National

గాడిదలకు సామూహిక సీమంతాలు.. ఎందుకంటే..?

గర్భం దాల్చిన 33 గాడిదలకు సీమంతం చేశారు. మనుషులకు చేసినట్టే గాడిదలను శుభ్రం చేసి అందంగా అలంకరించారు. నుదుట ఎర్రటి తిలకం దిద్ది, వీపుపై ఎర్రటి వస్త్రాలు కప్పారు.

గాడిదలకు సామూహిక సీమంతాలు.. ఎందుకంటే..?
X

ఇటీవల గోమాతలకు సీమంతాలు, లేగదూడలకు బారసాల కార్యక్రమాలు, ఆవులను కౌగిలించుకునే కార్యక్రమాలు భారత్ లో జోరుగా సాగుతున్నాయి. వీటికి తోడు ఇప్పుడు గాడిదలకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తున్నారు కొంతమంది. గుజరాత్ లోని రాజ్ కోట్ లో గాడిదలకు సామూహిక సీమంతాలు చేశారు. ఇటీవలే ఓ గాడిద పిల్లకు బారసాల కూడా చేశారు. అప్పుడే 33 గాడిదలకు ఒకేసారి సీమంతం చేయడం రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది.

హలరీ గాడిదలు..

రాజ్ కోట్ ప్రాంతం హలరీ గాడిదలకు ఫేమస్. ఎక్కువ పని చేయడం, ఎంత దూరమైనా అలసట లేకుండా ప్రయాణించడం వీటి ప్రత్యేకత. అయితే రాను రాను యాంత్రీకరణతో గాడిదల వాడకం తగ్గింది. వీటి జాతి కూడా అంతరిస్తోంది. ప్రస్తుతం అక్కడక్కడా గాడిద పాలకోసం వీటిని పెంచుతున్నారు. వీటి జాతిని కాపాడటం కోల్కి గ్రామ ప్రజలు నడుం బిగించారు. గాడిదలను ప్రత్యేకంగా పెంచుతున్నారు.

ఇటీవల కోల్కి గ్రామంలో ఓ గాడిద, బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బుల్లి గాడిదకు బారసాల చేసి స్థానికులు సంబరాలు చేసుకున్నారు. అదే సమయంలో గర్భం దాల్చిన 33 గాడిదలకు సీమంతం చేశారు. మనుషులకు చేసినట్టే గాడిదలను శుభ్రం చేసి అందంగా అలంకరించారు. నుదుట ఎర్రటి తిలకం దిద్ది, వీపుపై ఎర్రటి వస్త్రాలు కప్పారు. ఆ తర్వాత మహిళలు వాటికి పూజలు చేసి, ప్రత్యేక ఆహారాన్ని అందించారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించడం కోసం స్థానికులు తరలి వచ్చారు. కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వేడుకలు స్థానిక మీడియాలో వైరల్ గా మారాయి. ప్రస్తుతం దేశంలో హలరీ గాడిదల సంఖ్య సుమారు 417 మాత్రమే ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. వీటిని కాపాడేందుకు వివిధ స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వస్తున్నట్లు వెల్లడించారు.

First Published:  27 Feb 2023 12:08 PM IST
Next Story