LPG Gas Cylinder | రాఖీపౌర్ణమి పేరిట ఆడబడుచులతో సెంటిమెంట్.. గ్యాస్ బండపై రూ.200 తగ్గించిన కేంద్రం
ప్రధానంగా త్వరలో జరుగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలపై ప్రభావితం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం.. మహిళలకు, గృహిణులకు చేరువయ్యేందుకు సెంటిమెంట్ రాజకీయాలు చేస్తోంది.
LPG Gas Cylinder | త్వరలో తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలకు.. వచ్చే ఏడాది ఏప్రిల్-మే నెలల్లో సార్వత్రిక, పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్నాయి. పలు రాష్ట్రాల్లో పదేండ్లుగా.. మరి కొన్ని రాష్ట్రాల్లో ఐదేండ్లుగా, కేంద్రంలో పదేండ్లుగా అధికారంలో ఉన్న బీజేపీకి.. దాని సారథ్యంలోని ఎన్డీఏ పట్ల ప్రజల్లో క్రమంగా వ్యతిరేకత పెరుగుతోంది. మరోవైపు ఉపాధి అవకాశాలు లేకపోగా ప్రజల్లో భావోద్వేగాలు రగిల్చి విజయం సాధిస్తూ వచ్చిన బీజేపీ.. ఎన్డీఏ కూటమి పట్ల ప్రజల్లో అసంతృప్తి వ్యక్తం అవుతున్నది. మరోవైపు విపక్షాలు ఇండియా కూటమి పేరిట ఒక్కతాటిపైకి వచ్చే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి.
ప్రధానంగా త్వరలో జరుగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలపై ప్రభావితం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం.. మహిళలకు, గృహిణులకు చేరువయ్యేందుకు సెంటిమెంట్ రాజకీయాలు చేస్తోంది. చాలా కాలంగా తగ్గించని వంటగ్యాస్ సిలిండర్(14.2 కిలోలు) ధర రూ.200 తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ఢిల్లీలో వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.1103 నుంచి రూ.903లకు, మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో రూ.908, రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో రూ.906 పలుకుతుంది. అంతే కాదు `రక్షాబంధన్` సందర్భంగా బుధవారం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఓనం, రాఖీ పౌర్ణమి సందర్భంగా వంట గ్యాస్ సిలిండర్ ధర తగ్గించడం ద్వారా సోదరీమణులకు ప్రధాని నరేంద్రమోదీ భారీ బహుమతి ఇచ్చారని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు చెప్పారు. ఈ నిర్ణయం వల్ల 33 కోట్ల మంది వినియోగదారులకు లబ్ధి చేకూరుతుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఖజానాపై రూ.7,680 కోట్ల భారం పడుతుంది. అంతేకాదు ఆడబడుచులను ఆకట్టుకునేందుకు కొత్తగా 75 లక్షల `ఉజ్వల` గ్యాస్ కనెక్షన్లు కేంద్రం పంపిణీ చేస్తుందని చెప్పారు.
త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేంద్రం తీసుకున్న గ్యాస్ ధర తగ్గింపు, ఉజ్వల గ్యాస్ కనెక్షన్ల పంపిణీ నిర్ణయం.. అధికార బీజేపీకి లబ్ధి చేకూర్చేదని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్‌లో గత ఏప్రిల్ నుంచి బీపీఎల్ కుటుంబాలకు గ్యాస్ సిలిండర్‌పై రూ.500 రాయితీ అమలు చేస్తోంది. మధ్యప్రదేశ్‌లోనూ అధికారంలోకి వస్తే రూ.500 రాయితీ కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఈ రెండు రాష్ట్రాల్లో నవంబర్-డిసెంబర్‌లలో ఎన్నికలు జరుగుతాయి.
ఇంతకుముందు మార్చిలో 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.50 పెంచేశాయి కేంద్ర చమురు సంస్థలు. నాటి నుంచి ఢిల్లీలో వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.1103లకు చేరుకుంది. 2020 జూన్ నుంచి ఎల్పీజీ సిలిండర్‌పై సబ్సిడీకి పూర్తిగా ఎగనామం పెట్టాయి చమురు సంస్థలు. 2020 జూన్‌లో సబ్సిడీయేతర గ్యాస్ సిలిండర్ ధర రూ.593 ఉంటే.. ఇప్పుడు రూ.903 పలుకుతోంది. ఉజ్వల స్కీమ్ లబ్ధిదారులకు మాత్రం రూ.200 సబ్సిడీ లభిస్తుంది. అంటే తాజా రూ.200 తగ్గింపుతో ఉజ్వల లబ్ధిదారులు రూ.700లకే గ్యాస్ సిలిండర్ అందుకుంటారు.