డొమెస్టిక్ ఎయిర్‌ట్రావెల్‌లో రికార్డు.. ఒకేరోజు 4,71,751 మంది విమాన ప్రయాణం
ఈనెల 21న 6,128 విమాన సర్వీసుల్లో మొత్తం 4,71,751 మంది ప్రయాణించారని, ఇది ఆల్‌టైమ్ రికార్డ్ అని పౌరవిమానయాన శాఖ గణాంకాలు వెల్లడించాయి.
విమాన ప్రయాణం లగ్జరీ స్థాయి నుంచి అవసరం అనే స్థాయికి వచ్చేసింది. విద్య, ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం రాష్ట్రాలు దాటి వెళ్లడం సాధారణ వ్యవహారంగా మారిపోవడంతో దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నెల 21న అంటే మొన్నటి ఆదివారం దేశీయ విమాన (డొమెస్టిక్) సర్వీసుల్లో 4,71,751 మంది ప్రయాణించారు. ఇది భారతీయ విమానయాన చరిత్రలోనే ఆల్‌టైమ్ హయ్యస్ట్ రికార్డ్.
6,218 విమాన సర్వీసులు
ఈనెల 21న 6,128 విమాన సర్వీసుల్లో మొత్తం 4,71,751 మంది ప్రయాణించారని, ఇది ఆల్‌టైమ్ రికార్డ్ అని పౌరవిమానయాన శాఖ గణాంకాలు వెల్లడించాయి. గతేడాది ఇదే రోజున ప్రయాణించిన వారికంటే ఇది 50 వేలు ఎక్కువ.
కొవిడ్ ముందు కంటే వేగంగా అభివృద్ధి
2020లో కొవిడ్ వ్యాపించక ముందు రోజువారీ విమాన ప్రయాణికుల సగటు 3,98,579 ఉండేది. కరోనా లాక్‌డౌన్‌తో విమాన సర్వీసులు నిలిచిపోవడం, భారీ ఎత్తున చెకింగ్‌లు, శ్వాస పరీక్షలకు భయపడి చాలామంది విమాన ప్రయాణాలను తగ్గించుకున్నారు. సొంత వాహనాల్లో వెళ్లడం, రైల్వేలో ఏసీ బోగీల్లో ప్రయాణించడం పెరిగాయి. అయితే ఈనెల 21వ తేదీన విమానంలో ప్రయాణించివారి సంఖ్య కరోనాకు ముందు రోజువారీ సగటు కంటే 14% ఎక్కువ.