న్యాయ వ్యవస్థలో రాజకీయాలు ఎవరు నియంత్రించాలి : మంత్రి కిరణ్ రెజిజు
తదుపరి జడ్జిల గురించి ఎక్కువ సమయం ఆలోచన చేయడం వల్ల న్యాయ ప్రక్రియకు విఘాతం కలుగుతోందని మంత్రి ఆవేదన చెందారు.
జడ్జిలను జడ్జిలే నియమించుకునే పద్దతి ప్రపంచంలో ఎక్కడా లేదని, కేవలం మన దేశంలోనే అమలు అవుతుందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అన్నారు. కొలీజియం వ్యవస్థ మనకు అవసరం లేదని.. రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాల ప్రాతిపదికన జడ్జీలను నియమించే బాధ్యత ప్రభుత్వానిదే అని ఆయన స్పష్టం చేశారు. సామాన్య ప్రజలకు న్యాయ వ్యవస్థలో ఉండే రాజకీయాల గురించి తెలియదని.. కాని మనకు తెలిసినా ఎవరు నియంత్రించగలరని అన్నారు. న్యాయమూర్తులు ఎక్కువ సమయం తదుపరి జడ్జిగా ఎవరిని నియమించాలనే అంశంపైనే కేటాయిస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
తదుపరి జడ్జిల గురించి ఎక్కువ సమయం ఆలోచన చేయడం వల్ల న్యాయ ప్రక్రియకు విఘాతం కలుగుతోందని మంత్రి ఆవేదన చెందారు. ప్రజాస్వామ్యంలో కీలకమైన మూడు స్తంభాలలో కార్యనిర్వాహక, శాసన వ్యవస్థలను మూడో స్తంభమైన న్యాయ వ్యవస్థ నియంత్రిస్తోందన్నారు. కానీ అదే దారి తప్పితే నియంత్రించడానికి ఏ యంత్రాంగమూ లేదని మంత్రి వ్యాఖ్యానించారు. కొలీజియం ఏర్పాటుపై ప్రజలు సంతోషంగా లేరని రిజుజు అన్నారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి మిగిలిన జడ్జిలను నియమించే బాధ్యత న్యాయ శాఖ మంత్రి తీసుకునే వారు. 1993 వరకు ఆ పద్దతిలోనే నియామకాలు జరిగాయని గుర్తు చేశారు. అందుకే అప్పట్లో ఉద్ధండులైన జడ్జిలు ఉండేవారు. కానీ కొలీజియం వ్యవస్థ ఏర్పడిన తర్వాత జడ్జిల నియామకానికి తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయి. దీని వల్ల న్యాయ వ్యవస్థలో గ్రూపులు ఏర్పడుతున్నాయి. దీని ప్రభావం తర్వాత జడ్జిలు ఇచ్చే తీర్పులపై పడుతుందని మంత్రి అన్నారు. వేర్వేరు గ్రూపుల్లో ఉండే న్యాయమూర్తులు వేర్వేరు తీర్పులు ఉంటున్నాయని అన్నారు. ప్రస్తుతం విచారణలు ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. ఇప్పుడైనా జడ్జిలు సమన్వయంతో వ్యవహరించాలని కోరారు. న్యాయమూర్తులతో తాను భేటీ అయిన సమయంలో ఒక సూచన చేశాను. ఇకపై విచారణ సమయంలో జడ్జిలు వ్యాఖ్యలు చేయకపోవడం మంచిదని చెప్పాను. మరి అది కోర్టులు ఎంత మేరకు అమలు చేస్తాయో చూడాలని అన్నారు.