బాబోయ్ కుక్కలు.. మార్నింగ్ వాక్‌కి వెళితే మట్టుబెట్టాయి..
ఈ ఘటన జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేరు. ఆ తర్వాత కొద్దిసేపటికే అటుగా వచ్చిన పలువురు వ్యక్తులు సఫ్దర్ అలీ మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు.
ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. మార్నింగ్ వాక్‌కి వెళ్లిన వ్యక్తిపై దాదాపు పది కుక్కలు దాడి చేసి హతమార్చాయి. ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ క్యాంపస్‌లో డాక్టర్ సఫ్దర్ అలీ అనే వ్యక్తి ఉదయం 6 గంటల ప్రాంతంలో మార్నింగ్ వాక్‌కి వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత పార్కులో ఓ చోట నిలుచుని వ్యాయామం చేస్తున్నారు.
అదే సమయంలో అక్కడున్న దాదాపు పది కుక్కలు ఆయనపై గుంపుగా వచ్చి దాడికి దిగాయి. తప్పించేందుకు ఆయన ఎంతగా ప్రయత్నించినా కుదరలేదు. పదేపదే దాడి చేయడంతో పాటు నోటితే ఈడ్చుకెళుతూ తీవ్రంగా గాయపరిచాయి. దీంతో తీవ్ర గాయాలపాలైన సఫ్దర్ అలీ అక్కడికక్కడే మృతిచెందాడు.
ఈ ఘటన జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేరు. ఆ తర్వాత కొద్దిసేపటికే అటుగా వచ్చిన పలువురు వ్యక్తులు సఫ్దర్ అలీ మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మొదట ఎలా చనిపోయి ఉంటాడనేది ఊహించలేకపోయారు. అనంతరం సమీపంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, అసలు విషయం బయటపడింది. దీనికి సంబంధించిన వీడియోను పోలీసులు విడుదల చేయడంతో ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల చిన్న పిల్లలు కుక్కల బారిన పడి మృతిచెందుతున్న ఘటనలు ఒకరకమైన ఆందోళనను కలిగించగా, ఇప్పుడు ఏకంగా పెద్దల పైనే కుక్కలు దాడికి దిగుతూ.. ఏకంగా ప్రాణాలు తీస్తున్నాయనే విషయం ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.