దేశాన్ని అగ్నిగుండంలా మార్చాలనుకుంటున్నారా ? ....బీజేపీ నేతపై సుప్రీం కోర్టు సీరియస్
ఇది సెక్యులర్ దేశం అని, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని సుప్రీం కోర్టు ధర్మాసనం పేర్కొంది. గతం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుత తరాన్ని అస్థిర పర్చేలా ప్రతీ దాన్ని తవ్వితీయాల్సిన అవసరం లేదని కోర్టు వ్యాఖ్యానించింది.
దేశంలో విదేశీ ఆక్రమణదారుల పేర్లతో ఉన్న అన్ని ప్రాంతాలకు, ప్రదేశాలకు పేర్లు మార్చాలంటూ బీజేపీ నేత, న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీం కోర్టు సీరియస్ గా స్పందించింది. మీరు ఈ దేశాన్ని అగ్నిగుండంలా మార్చాలనుకుంటున్నారా? అని పిటిషనర్ ను సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ఇది రాజ్యాంగంలోని లౌకిక సూత్రాలకు విరుద్ధమైన పిటిషన్ అంటూ జస్టిస్ జోసెఫ్, జస్టిస్ బివి నాగరత్నలతో కూడిన ధర్మాసనం ఆ పిటిషన్ ను కొట్టి వేసింది.
ఇది సెక్యులర్ దేశం అని, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని సుప్రీం కోర్టు ధర్మాసనం పేర్కొంది. గతం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుత తరాన్ని అస్థిర పర్చేలా ప్రతీ దాన్ని తవ్వితీయాల్సిన అవసరం లేదని కోర్టు వ్యాఖ్యానించింది.
భారతదేశం లౌకిక దేశమని, మేము అప్పటి పాలకులను మీరు చెప్తున్నట్టు అనాగరిక పాలకులుగా అభివర్ణించలేమని జస్టిస్ జోసెఫ్ అన్నారు. హిందూ మతం గొప్ప మతమని, అది మతోన్మాదాన్ని అనుమతించదని బెంచ్ వ్యాఖ్యానించింది.
జస్టిస్ నాగరత్న మాట్లాడుతూ దేశంలో అనేక సమస్యలున్నాయని, వాటిని మొదట పరిష్కరించాలని, భారతీయులు తమలో తాము పోరాడుతూనే ఉండేలా బ్రిటిష్ వారు అనుసరించిన విభజించు, పాలించు విధానాన్నే మీరూ అనుసరిస్తే ఎలా అని ప్రశ్నించారు.
బీజేపీ నేత ఉపాధ్యాయ్ దాఖలు చేసిన PIL లో, దేశ సార్వభౌమత్వాన్ని, ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడుకోవడానికి, 'అనాగరిక విదేశీ ఆక్రమణదారులు' పేరు మార్చిన ప్రదేశాల అసలు పేర్లను తెలుసుకోవడానికి కమిషన్‌ను ఏర్పాటు చేయాలని హోం మంత్రిత్వ శాఖను ఆదేశించాలని కోరారు.
అయితే మనం చరిత్రను తిరగరాసి విదేశీయులెవ్వరూ మన దేశంపై దాడి చేయలేదని చెప్పగలమా అని జస్టిస్ జోసెఫ్ ప్రశ్నించారు.