ప్రధాని మోడీ ఆస్తుల విలువ ఎంతంటే..?
మోడీ మొత్తం ఆస్తుల్లో 95.55 శాతం గుజరాత్‌లోని గాంధీనగర్ ఎస్‌బీఐ NSC బ్రాంచ్‌లో FDR, MODల రూపంలోనే ఉంది. గత సంవత్సరంతో పోలిస్తే దీని విలువలో 17.64% వృద్ధి నమోదైంది.
ప్రధాని మోడీ తన ఆస్తుల విలువ వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆస్తి విలువ 2 కోట్ల 58 లక్షల 96 వేల 444 రూపాయలుగా ఉంది. మార్చి 31తో ముగిసిన 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆయన సమర్పించిన ఆస్తి, అప్పుల పట్టి ద్వారా విషయం వెల్లడైంది. గతేడాదితో పోలిస్తే 35 లక్షల 13 వేల రూపాయల పెరుగుదల కనిపించింది.
ప్రధాని మోడీ పేరున కొంత డబ్బు, బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్లు, మల్టి ఆప్షన్ డిపాజిట్లు, నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్లు, 4 బంగారు ఉంగరాలు మినహా ఇతర స్థిర, చర ఆస్తులు ఏమి లేవని ఆయన ప్రకటించారు. గతేడాది ఎల్‌ఐసీ పాలసీలు చూపినప్పటికీ.. ఈ సారి వాటి ప్రస్తావన తీసుకురాలేదు.
ఇక మోడీ మొత్తం ఆస్తుల్లో 95.55 శాతం గుజరాత్‌లోని గాంధీనగర్ ఎస్‌బీఐ NSC బ్రాంచ్‌లో FDR, MODల రూపంలోనే ఉంది. గత సంవత్సరంతో పోలిస్తే దీని విలువలో 17.64% వృద్ధి నమోదైంది. అదే ఎస్‌బీఐలోని మరో ఖాతాలో నగదు నిల్వ రూ.46వేల నుంచి మినిమమ్ బ్యాలెన్స్ స్థాయి రూ.574 లకు పడిపోయింది. ఆయన డిపాజిట్లు, పోస్టల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్ విలువ ఈసారి పెరిగింది. సతీమణి జసోదాబెన్ పేరున ఉన్న ఆస్తి వివరాలు తెలియదని మోడీ పేర్కొన్నారు.