Telugu Global
National

త‌మిళిసై ప‌రిస్థితే మీకూ వస్తుంది- గవర్నర్‌కు డీఎంకే వార్నింగ్

డీఎంకే అధికార పత్రిక ''మురసోలి'' గవర్నర్‌ రవికి హెచ్చరికలు జారీ చేసింది. తీరు మార్చుకోకపోతే తెలంగాణ గవర్నర్‌కు వచ్చిన పరిస్థితే ఇక్కడి గవర్నర్‌ ఆర్‌.ఎన్‌. రవి కూడా ఎదుర్కోవాల్సి రావొచ్చు అని హెచ్చరించింది.

త‌మిళిసై ప‌రిస్థితే మీకూ వస్తుంది- గవర్నర్‌కు డీఎంకే వార్నింగ్
X

రాష్ట్రాల్లో మ్యాజిక్‌ ఫిగర్‌ కంటే కొద్దిగా అధిక సీట్లు సాధించి ప్రభుత్వాలను నడుపుతున్నపార్టీని చీల్చి ప్రభుత్వాలను పడగొట్టడం, ఫుల్ మెజారిటీతో నడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలను గవర్నర్ల ద్వారా చికాకు పెట్టడం. ఈ రెండు అంశాల‌నే బీజేపీ పనిగా పెట్టుకుందన్న‌ది దేశవ్యాప్తంగా వినిపిస్తున్న గట్టి విమర్శ.

తెలంగాణలో ప్రభుత్వాన్ని కూల్చే అవకాశం లేకపోవడంతో గవర్నర్‌ ద్వారా వివాదానికి బీజేపీ కాలు దువ్వుతోందని టీఆర్‌ఎస్ చాలా కాలంగా ఆరోపిస్తోంది. గవర్నర్ తమిళిసై కూడా పదేపదే రాజకీయ విమర్శలు చేస్తున్నారు. అసలు కేసీఆర్‌ ఎక్కడికి వెళ్లాలో, ఏం చేయాలో కూడా ఈ మధ్య ఆమే చెబుతున్నారు. దక్షిణాది రాష్ట్రాల మీటింగ్‌కు ఎందుకెళ్లలేదని కేసీఆర్‌ను గవర్నర్ ప్రశ్నించిన సంద‌ర్భం కూడా ఉంది. తనను కేసీఆర్ ప్రభుత్వం నిత్యం అవమానిస్తోందంటూ ఆమె ఆరోపణలు చేశారు.

తమిళనాడులో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. అక్కడి గవర్నర్‌ ఆర్‌.ఎన్‌ రవి కూడా స్టాలిన్‌ ప్రభుత్వ నిర్ణయాలు అమలు కాకుండా అడ్డుపడుతున్నారన్న విమర్శ ఉంది. అయితే తమిళనాడు అధికార పార్టీ డీఎంకే.. నేరుగా గవర్నర్‌కు వార్నింగ్ ఇచ్చేసింది. డీఎంకే అధికార పత్రిక ''మురసోలి'' గవర్నర్‌ రవికి హెచ్చరికలు జారీ చేసింది.

తీరు మార్చుకోకపోతే తెలంగాణ గవర్నర్‌కు వచ్చిన పరిస్థితే ఇక్కడి గవర్నర్‌ ఆర్‌.ఎన్‌. రవి కూడా ఎదుర్కోవాల్సి రావొచ్చు అని హెచ్చరించింది. గవర్నర్ తమిళిసై రాజకీయాలు చేస్తున్నారని టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆరోపించిందని.. కేంద్ర ప్రభుత్వం ద్వారా నియమితులైన ఒక వ్యక్తి .. ప్రజల ద్వారా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఏ ప్రభుత్వమైనా ఎంత వరకు సహిస్తుందని డీఎంకే పత్రిక వ్యాఖ్యానించింది. గవర్నర్లు కేంద్ర ప్రభుత్వ ఏజెంట్లుగా పనిచేయడం మానుకోవాలంది.

రెండు అధికారిక కేంద్రాల మధ్య పోరు ఎందుకు అని తమిళనాడు ప్రభుత్వం సర్దుకుని పోతుండవచ్చని.. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు గవర్నర్‌ మునుముందు ప్రయత్నించినా, పోరు ఆపకపోయినా తెలంగాణ గవర్నర్ తమిళిసై చవిచూస్తున్న పరిస్థితే తమిళనాడు గవర్నర్ రవికి కూడా రావొచ్చు అని డీఎంకే పత్రిక జోస్యం చెప్పింది.

First Published:  13 Sept 2022 1:30 AM
Next Story