Tamilnadu:హిందీ బాషను రుద్దడానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్త నిరసనలు
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపై బలవంతంగా హిందీ బాషను రుద్దే ప్రయత్నానికి వ్యతిరేకంగా ఈ రోజు తమిళనాడు వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి.
IIT, IIM, AIIMS తదితర కేంద్ర విద్యాసంస్థల్లో హిందీని బోధనా మాధ్యమంగా చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలోని పార్లమెంటరీ ప్యానెల్ చేసిన సిఫారసుకు వ్యతిరేకంగా తమిళనాడు వ్యాప్తంగా ఈ రోజు నిరసన ప్రదర్శనలు జరిగాయి. డీఎంకే పిలుపు మేరకు వేలాదిమంది కార్యకర్తలు ఈ ప్రదర్శనల్లో పాల్గొన్నారు.
తమిళనాడులోని అన్ని జిల్లాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రదర్శనలు నిర్వహించారు. డీఎంకే యువజన విభాగం కార్యదర్శి, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ నేతృత్వంలో చెన్నైలో నిరసన చేపట్టారు. "హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నాలు ఇలాగే కొనసాగితే, మేము ఢిల్లీలో ప్రధానమంత్రి కార్యాలయం ముందు నిరసన చేస్తాము." అని ఉదయనిధి స్టాలిన్ హెచ్చరించారు.
పలు చోట్ల ఇతర డీఎంకే నేతలు మాట్లాడుతూ "ఒకే దేశం, ఒకే మతం, ఒకే భాష అనే భావనతో దేశంలోని వైవిధ్యాన్ని ధ్వంసం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది" అని ఆరోపించారు. 1930వ దశకం చివరిలో, 1965లో రాష్ట్రంలో జరిగిన హిందీ వ్యతిరేక ఆందోళనలను పలువురు వక్తలు గుర్తు చేశారు. మళ్ళీ అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
హిందీని అధికారిక భాషగా చేయాలనే ఆలోచనను మోడీ, అమిత్ షా లు ప్రాథమిక స్థాయిలోనే నిలిపివేయక పోతే ఒక్క తమిళనాడే కాకుండా దక్షిణ, ఈశాన్య భారత దేశం తిరగబడుతుందని హెచ్చరించారు మాజీ మంత్రి పొంగళూరు ఎన్. పళనిసామి.