Telugu Global
National

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు డీఎంకే వ్యతిరేకం..

సామాజిక వర్గాల వారీగా రిజర్వేషన్లు అంతరాలను తగ్గిస్తాయని, కానీ ఆర్థిక పరిస్థితుల ఆధారంగా కల్పించే రిజర్వేషన్లతో మళ్లీ మొదటికే మోసం వస్తుందని సుప్రీంకోర్టుకి తెలిపింది డీఎంకే.

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు డీఎంకే వ్యతిరేకం..
X

ఎకనమికల్లీ వీకర్‌ సెక్షన్‌ (ఈడబ్ల్యూఎస్) 10శాతం రిజర్వేషన్లు తమకు సమ్మతం కాదని తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం సుప్రీంకోర్టుకి తెలిపింది. ఈ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పిస్తూ చేసిన 103వ రాజ్యాంగ సవరణ చెల్లుబాటుని కూడా డీఎంకే సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. సామాజిక వర్గాల వారీగా రిజర్వేషన్లు అంతరాలను తగ్గిస్తాయని, కానీ ఆర్థిక పరిస్థితుల ఆధారంగా కల్పించే రిజర్వేషన్లతో మళ్లీ మొదటికే మోసం వస్తుందని సుప్రీంకోర్టుకి తెలిపింది డీఎంకే. ఈమేరకు డీఎంకే ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్‌ఎస్ భారతి సుప్రీంకోర్టుకి లిఖిత పూర్వకంగా తమ అభ్యంతరాలు తెలిపారు.

తమిళనాట రిజర్వేషన్లు అత్యథికం..

వాస్తవానికి దేశంలోనే అత్యథిక రిజర్వేషన్లు అమలు చేస్తున్న రాష్ట్రం తమిళనాడు. సామాజిక అంతరాల వారీగా అక్కడ 69శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. రిజర్వేషన్లు 50శాతం దాటడం ఏంటని గతంలో సుప్రీంకోర్టు ప్రశ్నించినా, ప్రత్యేక వెసులుబాటు ప్రకారం అక్కడ అత్యథిక రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి. ఇప్పుడు వీటికి తోడు కేంద్రం 10శాతం ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్లు ఇస్తే ఇది మరో సమస్యకు దారి తీస్తుంది. అందుకే డీఎంకే ఈ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తోంది.

అణచివేత కొనసాగే ప్రమాదం..

శతాబ్దాల అణచివేత, సాంఘిక బహిష్కరణను తుదముట్టించడానికే రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని, అలాంటిది ఇప్పుడు ఆర్థిక అంతరాలను చూపిస్తూ ప్రత్యేక రిజర్వేషన్లు ఇస్తే సామాజిక అంతరాలు కొనసాగే ప్రమాదం ఉందని డీఎంకే అనుమానం వ్యక్తం చేస్తోంది. అగ్ర కులాలకు రిజర్వేషన్లు ఇవ్వడం అంటే, అది రాజ్యాంగంలోని రిజర్వేషన్ల భావనను అపహాస్యం చేయడమేనంటున్నారు డీఎంకే నేతలు. అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ మొదలైంది. ఈ విచారణలో భాగంగా డీఎంకే తన నిర్ణయాన్ని తెలియజేసింది.

First Published:  13 Sept 2022 6:11 PM IST
Next Story