భక్తి గురించి ఎవరూ మాకు నేర్పించాల్సిన అవసరం లేదు
భక్తి గురించి ఎవరూ తమకు నేర్పించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. భక్తి, మతం గురించి తాము ప్రచారం చేయమని, అలా చేయాలని ఎవరూ కూడా చెప్పలేదన్నారు
దేవుళ్ళ పట్ల తమకు ఎంతో భక్తి ఉందని, భక్తి గురించి ఎవరూ తమకు నేర్పించాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు. జనవరి 22న అయోధ్య రామ మందిరంలో బాల రాముడి ప్రాణప్రతిష్ట జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆరోజున దేశంలోని పలు రాష్ట్రాలు సెలవు ప్రకటించాయి.
అయితే కర్ణాటకలో సెలవు ప్రకటించకపోవడంపై బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. ఈ నేపథ్యంలో డీకే శివకుమార్ ఆ పార్టీ నాయకులకు కౌంటర్ ఇచ్చారు. భక్తి గురించి ఎవరూ తమకు నేర్పించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. భక్తి, మతం గురించి తాము ప్రచారం చేయమని, అలా చేయాలని ఎవరూ కూడా చెప్పలేదన్నారు. అయోధ్య ప్రాణప్రతిష్ట సందర్భంగా రాష్ట్ర మంత్రులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని తెలిపారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేరులోనే రాముడు ఉన్నాడని, తన పేరులో శివుడు ఉన్నాడని శివకుమార్ చెప్పారు.
బాల రాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా జనవరి 22న దేశంలోని చాలా రాష్ట్రాలు సెలవు ప్రకటించాయి. మద్యం షాపులు కూడా తెరవద్దని ఆదేశాలిచ్చాయి. దేశంలోని పలు రాష్ట్రాలు 22న సెలవు ప్రకటించినప్పటికీ దక్షిణ భారతదేశంలోని కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో మాత్రం సెలవు ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాలపై బీజేపీ నేతలు వరుసగా విమర్శలు చేస్తున్నారు.