Telugu Global
National

వెన్నుపోటు, బ్లాక్ మెయిల్.. డీకే హాట్ కామెంట్స్

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కర్నాటక నుంచి కాంగ్రెస్ 20 ఎంపీ సీట్లు గెలవడమే తన టార్గెట్ అని చెబుతున్నారు డీకే శివకుమార్. తానెవర్నీ వెన్నుపోటు పొడవని, బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయనని వెల్లడించారు.

వెన్నుపోటు, బ్లాక్ మెయిల్.. డీకే హాట్ కామెంట్స్
X

కర్నాటక సీఎం కుర్చీ కోసం గట్టి పోటీ నెలకొన్న వేళ, అధిష్టానం తుది నిర్ణయం తీసుకోబోతున్న వేళ.. రేస్ లో ఉన్న డీకే శివకుమార్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఢిల్లీకి బయలుదేరే ముందు ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి. తానెవర్నీ వెన్నుపోటు పొడవబోనని, బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయనని వెల్లడించారు డీకే. తాను ఒక్కడినే ఢిల్లీ వెళ్తున్నానని చెప్పారు.

ఎందుకీ వ్యాఖ్యలు..

పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను, అధిష్టానానికి బద్ధుడిని అని చెప్పడం వేరు.. వెన్నుపోటు పొడవను, బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయను అని చెప్పడం వేరు. ఇంతకీ అధిష్టానానికి డీకే ఏం చెప్పాలనుకుంటున్నారు. ఒకవేళ తనకు సీఎం కుర్చీ ఇవ్వకపోయినా తాను పార్టీకి వెన్నుపోటు పొడవను అనే క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారా..? ఇలాంటి మాటలతో నిజంగానే బ్లాక్ మెయిలింగ్ కి అవకాశాలున్నాయని చెప్పారా..?

సిద్ధరామయ్య మౌనం..

మరోవైపు సిద్ధరామయ్య ఎలాంటి స్టేట్ మెంట్లు ఇవ్వకుండా మౌనంగానే ఉన్నారు. ఆయన తనయుడు మాత్రం ఫలితాలు వచ్చిన తర్వాత సిద్ధరామయ్యకే సీఎం సీటు ఇవ్వాలన్నారు. ఆ తర్వాత ఆయన అభిమానులు బెంగళూరులో పోస్టర్లు వేసి హడావిడి చేశారు. అది మినహా ఆయన ఎక్కడా బయటపడలేదు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్జేని కలసిన సందర్భంలో కూడా సిద్ధరామయ్య ఫార్మల్ మీటింగ్ అని ముక్తాయించారు. మొత్తమ్మీద సిద్ధరామయ్య తన విధేయతను చాటుకుంటూ అధిష్టానాన్ని అనునయించాలనుకుంటున్నారు. డీకే శివకుమార్ మాత్రం సీఎం సీటుకి అర్హుడిని తానేననే సందేశం అధిష్టానానికి పంపించాలనుకుంటున్నారు.

లోక్ సభ ఎన్నికల్లో 20 సీట్లు..

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కర్నాటక నుంచి కాంగ్రెస్ 20 ఎంపీ సీట్లు గెలవడమే తన టార్గెట్ అని చెబుతున్నారు డీకే శివకుమార్. కాంగ్రెస్ ఓ ఉమ్మడి కుటుంబం అని, కర్నాటక అసెంబ్లీలో తమ బలం 135 అని, ఆ బలాన్ని విడగొట్టాలని తాను అనుకోవట్లేదని చెప్పారు. తాను ఓ బాధ్యతాయుతమైన వ్యక్తిని అని అన్నారు. పార్టీ వల్లే తాను ఈ స్థానంలో ఉన్నానని, పార్టీనే తన ఇల్లు అని, తామంతా కలిసి పార్టీని నిర్మించుకున్నామన్నారు.

First Published:  16 May 2023 2:55 PM IST
Next Story