2వేల నోట్లతో షాపింగ్ చేస్తే డిస్కౌంట్లు, ఆఫర్లు..
కొన్నిచోట్ల 2000 రూపాయలకు బదులుగా 2100 రూపాయల విలువైన చికెన్, మటన్ ను ఇస్తున్నారు. ఢిల్లీలోని ఓ చికెన్ షాపు యజమాని ఇలాంటి ఆఫర్ తో కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు.
2వేల నోట్ల ఉపసంహరణ విషయంలో చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు 2వేల నోట్లు తీసుకోలేం అంటూ షాపుల ముందు బోర్డ్ లు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే కొత్తగా ఇప్పుడు 2వేల నోట్లకు డిమాండ్ పెరిగింది. వాటికి ఘనంగా ఫేర్ వెల్ ఇస్తున్నారు షాపుల యజమానులు. 2వేల నోట్లతో షాపింగ్ చేస్తే డిస్కౌంట్లు, ఆఫర్లు ప్రకటించారు.
ఇటీవల పెట్రోల్ బంకుల్లో 2వేల నోట్లు వద్దు అనే బోర్డ్ లు చూశాం. కొంతమంది కస్టమర్ల వద్ద కొట్టించిన పెట్రోల్ కూడా వెనక్కి తీసుకున్న ఉదాహరణలున్నాయి. దీంతో మరికొందరు వ్యాపారులు రూటు మార్చారు. మా వద్ద 2వేల నోట్లు తీసుకొనబడును అనే బోర్డులు పెట్టారు. ఇంకేముంది అక్కడకు కస్టమర్లు క్యూ కట్టారు. వ్యాపారం పెరిగింది. ఇదే సూత్రం ఇప్పుడు చాలా చోట్ల ఉపయోగిస్తున్నారు.
కొన్నిచోట్ల 2000 రూపాయలకు బదులుగా 2100 రూపాయల విలువైన చికెన్, మటన్ ను ఇస్తున్నారు. ఢిల్లీలోని ఓ చికెన్ షాపు యజమాని ఇలాంటి ఆఫర్ తో కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు. మధ్యప్రదేశ్ లోని ఓ వ్యాపారి 2500 విలువైన బ్రాండెడ్ దుస్తుల్ని 2వేల రూపాయల నోటు ఉంటే 500 రూపాయల డిస్కౌంట్ లో ఇస్తున్నాడు. ఇలా కొంతమంది వ్యాపారులు తెలివిగా 2వేల నోటుని తమ బిజినెస్ కోసం ఉపయోగిస్తున్నారు. ఆ తర్వాత అందరిలాగే వారు కూడా వాటిని బ్యాంకుల్లో మార్చేసుకుంటున్నారు.
2వేల నోటు మాకొద్దు అనేవారికంటే, 2వేల నోటు ఇస్తే డిస్కౌంట్ ఇస్తాం అనే వారినే వెతుక్కుంటూ వెళ్తున్నారు కస్టమర్లు. బ్యాంకులో జమ చేయడం కంటే, ఇలా షాపింగ్ చేయడం మంచిదని ఫీలవుతున్నారు. ఇలాంటి ఆఫర్లతో బిజినెస్ పెంచుకుంటూ షాపులకు ఉచిత ప్రచారం కూడా చేసుకుంటున్నారు యజమానులు. మొత్తమ్మీద 2వేల నోటు అంటరానిదవుతుందని అనుకున్నాం కానీ, ఇలా పిలిచి డిస్కౌంట్లు ఇస్తారనుకోలేదని కస్టమర్లు సంబరపడిపోతున్నారు.