రాష్ట్రాలకు విపత్తు నిర్వహణ నిధులు విడుదల.. - ఏపీ, తెలంగాణలకు కేటాయింపులు ఇలా..
మొత్తంగా రూ.7,532 కోట్లు కేంద్రం విడుదల చేసింది. అందులో ఆంధ్రప్రదేశ్‌కు రూ.493.60 కోట్లు, తెలంగాణకు రూ.188.80 కోట్లు కేటాయించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు విపత్తుల నిర్వహణ నిధులను బుధవారం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో వీటి ప్రభావం అధికంగా ఉంది. వరదల కారణంగా పలు రాష్ట్రాలు భారీ నష్టాన్ని చవిచూస్తున్నాయి. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.
దేశంలోని 22 రాష్ట్రాలలోని విపత్తు స్పందన నిధి కోసం మొత్తంగా రూ.7,532 కోట్లు కేంద్రం విడుదల చేసింది. అందులో ఆంధ్రప్రదేశ్‌కు రూ.493.60 కోట్లు, తెలంగాణకు రూ.188.80 కోట్లు కేటాయించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కేంద్రం విడుదల చేసిన నిధుల్లో అత్యధికంగా మహారాష్ట్రకు రూ.1420.80 కోట్లు, అత్యల్పంగా గోవాకు రూ.4.80 కోట్లు.
కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సిఫార్సు మేరకు ఈ నిధులు విడుదల చేసినట్టు ఆర్థిక శాఖలోని వ్యయ విభాగం వెల్లడించింది. దేశవ్యాప్తంగా భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకొని వీటిలో నిబంధనలను సడలించినట్లు తెలిపింది. గత ఆర్థిక సంవత్సర నిధులకు సంబంధించిన వినియోగ ధ్రువీకరణ పత్రాల కోసం వేచిచూడకుండానే ఈ మొత్తాన్ని విడుదల చేస్తున్నట్లు పేర్కొంది.