Telugu Global
National

మ‌ర్యాద మ‌రచిన మోడీ

ప్రధాని మోడీ సంకుచిత స్వభావం బయటపడిందని టీఆర్‌ఎస్‌ లాంటి పార్టీలు విమర్శలు ఎక్కుపెట్టాయి.

మ‌ర్యాద మ‌రచిన మోడీ
X

ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ పదవీ విరమణ సందర్భంగా గౌరవార్ధం పీఎం మోడీ ఇచ్చిన విందు విమర్శలకు కేంద్రబిందువుగా మారింది. ప్రధాని హోదాలో విందు ఇచ్చినా .. కార్యక్రమానికి ఆహ్వానాలు పంపే విషయంలో ఎన్‌డీఏ నేతగా మోడీ వ్యవహరించారన్న విమర్శలు వస్తున్నాయి. కార్యక్రమానికి తనకు గిట్టని ముఖ్యమంత్రులకు ప్రధాని మోడీ ఆహ్వానం పంపలేదు. ఇక్కడే ప్రధాని మోడీ సంకుచిత స్వభావం బయటపడిందని టీఆర్‌ఎస్‌ లాంటి పార్టీలు విమర్శలు ఎక్కుపెట్టాయి.

రామ్‌నాథ్‌ కోవింద్‌ ఇండియాకు రాష్ట్రపతి కాదు.. తమ ఎన్‌డీఏకు మాత్రమే రాష్ట్రపతి.. అందుకే తమకు గిట్టని ముఖ్యమంత్రులను ఆహ్వానించబోం అన్నట్టుగా ప్రధాని మోడీ తీరుందని మండిపడుతున్నారు. విందుకు కేవలం 21 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మాత్రమే ఆహ్వానం పంపారు. సరే కేవలం బీజేపీ ముఖ్యమంత్రులకే ఆహ్వానం పంపారా అంటే అదీ లేదు. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌లకు మాత్రం ఆహ్వానం పంపారు. కొత్త సీఎం ఏక్‌నాథ్‌షిండేకు ఆహ్వానం వెళ్లింది.

తెలంగాణ సీఎం కేసీఆర్‌, బెంగాల్ సీఎం మమత తదితరులను విందుకు దూరంగా పెట్టారు ప్రధాని. వీరుఇరువురు కేంద్ర ప్రభుత్వంపై గట్టిగా గళమెత్తుతున్నారు. విపక్షాలకు చెందిన కేరళ, రాజస్థాన్‌, పంజాబ్, ఢిల్లీ ముఖ్యమంత్రులను కూడా రాష్ట్రపతి ఫేర్‌వెల్‌ పార్టీకి పిలవలేదు. అయితే రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్ష అభ్యర్థికి మద్దతు ఇచ్చినప్పటికీ తమిళనాడు సీఎం స్టాలిక్‌కు మాత్రం ఇన్విటేషన్‌ వెళ్లింది. ఆయన హాజరు కాలేదు. ఏపీ సీఎం జగన్‌ కూడా కార్యక్రమానికి వెళ్లలేదు.

ప్రధాని నరేంద్రమోడీ ఈ తరహా రాజకీయాలు చేయడంపై టీఆర్‌ఎస్ భగ్గుమంటోంది. మోడీ కనీస మర్యాదలను కూడా పాటించడం లేదని టీఆర్‌ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. రాష్ట్రపతి వీడ్కోలు విందును ఎన్‌డీఏ కార్యక్రమంగా మార్చేశారని టీఆర్‌ఎస్ పత్రిక విమర్శించింది. అసలు ఎమ్మెల్యే, ఎంపీ, కనీసం సర్పంచ్‌ కూడా కానీ పవన్‌ కల్యాణ్‌కు ఆహ్వానం పంపడాన్ని ప్రశ్నించింది. ప్రధాని దృష్టిలో రాష్ట్రపతి కోవింద్ బీజేపీకి మాత్రమే రాష్ట్రపతా అని నిలదీసింది టీఆర్‌ఎస్ పత్రిక.

First Published:  23 July 2022 7:28 AM IST
Next Story