Telugu Global
National

రాహుల్ జగమొండి.. ఆయన్ను బలవంతంగా ఒప్పించలేం..

తాత్కాలిక ప్రెసిడెంట్ గా బాధ్యతలు నెరవేరుస్తున్న సోనియా గాంధీ పూర్తి స్థాయిలో పగ్గాలు చేపట్టేందుకు విముఖతతో ఉన్నారు. ఆరోగ్య సమస్యలు, వారసుడికి బరువు బాధ్యతలు అప్పగించాలన్న ఆతృత.. ఈ రెండిటి మధ్య సోనియా నలిగిపోతున్నారు.

రాహుల్ జగమొండి.. ఆయన్ను బలవంతంగా ఒప్పించలేం..
X

రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్ష పదవిని చేపడతారా, లేదా అనే సస్పెన్స్ కి ఒకరకంగా తెరదించేశారు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్. ఆ విషయంలో రాహుల్ ని బలవంతంగా తాము ఒప్పించలేమని స్పష్టం చేశారాయన. రాహుల్ గాంధీకి కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం ఇష్టం లేకపోతే, తాము బలవంతం చేయలేమని ఆయన చెప్పారు. ఇప్పటికే ఆయన పదవి విషయంలో సుముఖంగా లేరని తెలుస్తోంది. దీనిపై సీనియర్ నేతలు ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసినా ఫలితం లేదు. ఇటీవల‌ రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాత్ కూడా రాహుల్ ని మనసు మార్చోకోవాలని విజ్ఞప్తి చేశారు. కనీసం దానిపై స్పందన కూడా లేదు, ఆ తర్వాత దిగ్విజయ్ సింగ్ బయటపడ్డారు. రాహుల్ ని ఎవరూ బలవంతపెట్టలేరనే వ్యాఖ్యలు చేశారు. అంటే దాదాపుగా కాంగ్రెస్ సీనియర్లకు ఈ విషయంలో క్లారిటీ ఉందని తెలుస్తోంది.

ప్రియాంకకు పగ్గాలు అప్పగిస్తారా..?

గతంలో ఏఐసీసీ అనగానే రాహుల్ కంటే ఎక్కువగా ప్రియాంక గాంధీ పేరు వినిపించేది. ఆమె సీన్లోకి రానంత వరకు ఏదో ఊహించేసుకున్నారు కాంగ్రెస్ నేతలు, కానీ ప్రియాంక ఆధ్వర్యంలో యూపీ ఎన్నికలను కాంగ్రెస్ సమర్థంగా ఎదుర్కోలేకపోయింది, అందుకే ఆమె సార్థ్యాన్ని కూడా చాలామంది శంకిస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కోవాలంటే, వేగంగా నిర్ణయాలు తీసుకోవాలంటే, వ్యూహాలు మార్చాలంటే.. ఏఐసీసీకి బలమైన, దృఢమైన నాయకత్వం కావాలి. ఆ విషయంలో కాంగ్రెస్ ఇంకా సందిగ్ధంలోనే ఉంది.

సోనియాకు వీలు కాదు..

తాత్కాలిక ప్రెసిడెంట్ గా బాధ్యతలు నెరవేరుస్తున్న సోనియా గాంధీ పూర్తి స్థాయిలో పగ్గాలు చేపట్టేందుకు విముఖతతో ఉన్నారు. ఆరోగ్య సమస్యలు, వారసుడికి బరువు బాధ్యతలు అప్పగించాలన్న ఆతృత.. ఈ రెండిటి మధ్య సోనియా నలిగిపోతున్నారు. రాహుల్ గాంధీ మిగతా వ్యవహారాలన్నిటిలో యాక్టివ్ గానే ఉంటున్నారు. ఇటీవల భారత్ జోడో యాత్రపై కూడా సమీక్ష నిర్వహించారు, షెడ్యూల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. యాత్రకోసం ఆయన ఉత్సాహంగా ఉన్నారు. కానీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అనే పదవికి మాత్రం ఆయన దూరం అంటున్నారు.

సెప్టెంబర్ 20లోగా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటామని కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. కానీ ఎన్నికల ప్రక్రియ ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. వాస్తవానికి ఈ వారంలో కాంగ్రెస్ అంతర్గత ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావాల్సి ఉంది. దీన్ని సాగదీస్తే.. వైరి వర్గాలకు మరో అవకాశం ఇచ్చినట్టవుతుందని సీనియర్ నేతలు భయపడుతున్నారు. అధ్యక్షుడు లేని పార్టీ అంటూ వెటకారం చేస్తారనే ఆందోళనలో ఉన్నారు. కానీ ఇక్కడ రాహుల్ ని ఒప్పించేంత సాహసం వారు చేయలేకపోతున్నారు.

First Published:  24 Aug 2022 8:27 AM IST
Next Story