Telugu Global
National

డిజిటల్ డేటా ప్రొటెక్షన్ బిల్లుకు లోక్‌సభలో ఆమోదం.. దీనిలోని ఈ క్లాజ్ గురించి తెలుసా?

డిజిటల్ డేటా ప్రొటెక్షన్ బిల్లులో దీనికి సంబంధించి ప్రత్యేకమైన క్లాజ్‌ను పొందుపరిచారు. తప్పుడు సమాచారానికి సంబంధించిన సవరణ, తొలగించే హక్కును దీని ద్వారా ప్రతీ పౌరుడు పొందే అవకాశం ఉన్నది.

డిజిటల్ డేటా ప్రొటెక్షన్ బిల్లుకు లోక్‌సభలో ఆమోదం.. దీనిలోని ఈ క్లాజ్ గురించి తెలుసా?
X

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని వచ్చిన డిజిటల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు 2023కి లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఇందులో తప్పుడు సమాచారాన్ని తొలగించాలని కోరేందుకు అందరికీ హక్కు కల్పించారు. సమాచార గోప్యత.. వ్యక్తిగత గోప్యతలో భాగమే అని ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసింది. డిజిటల్ డేటా ప్రొటెక్షన్ బిల్లులో దీనికి సంబంధించి ప్రత్యేకమైన క్లాజ్‌ను పొందుపరిచారు. తప్పుడు సమాచారానికి సంబంధించిన సవరణ, తొలగించే హక్కును దీని ద్వారా ప్రతీ పౌరుడు పొందే అవకాశం ఉన్నది.

డిజిటల్ డేటా ప్రొటెక్షన్ బిల్లులో రైట్ టూబీ ఫర్‌గాటెన్ (సెక్షన్ 12) ప్రకారం గతంలో ఎవరైనా తమ వ్యక్తిగత సమాచారాన్ని వినియోగించేందుకు అనుమతి ఇచ్చినట్లయితే.. సదరు సమాచారంలోని తప్పులను సవరించేందుకు లేదా అప్‌డేట్ చేసేందుకు.. అవసరం అయితే తొలగించాలని కోరడానికి పూర్తి హక్కు ఉంటుంది. సదరు సంస్థలకు తప్పకుండా ఆ సమాచారాన్ని అప్‌డేట్ చేయాలి లేదంటే డిలీట్ చేయాలి.

డిజిటల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు ప్రకారం ఏ వ్యక్తి సమాచారాన్ని అయినా సేకరించాలని భావిస్తే.. తప్పకుండా ఆ వ్యక్తి నుంచి అనుమతి తీసుకోవాలి. డిజిటల్ యూజర్ల డేటా ప్రైవసీని కాపాడలేక పోయినా, సమాచారాన్ని దుర్వినియోగం చేసినట్లు తేలినా సదరు సంస్థకు రూ.50 కోట్ల నుంచి రూ.250 కోట్ల వరకు జరిమానా విధించవచ్చని బిల్లు తెలియజేస్తోంది. కొత్తగా రూపొందిన ఈ చట్టాన్ని అమలు చేసేందుకు డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయనున్నారు.

మరోవైపు కేంద్రానికి కూడా కొన్ని అధికారాలు సంక్రమించనున్నాయి. బోర్డు రిఫర్ చేస్తే ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఏదైనా సమాచారాన్ని బ్లాక్ చేసే అవకాశం కేంద్రానికి ఉంటుంది. ఇక వ్యక్తిగత సమాచారాన్ని ఏదైనా సంస్థ ఏ అవసరాల కోసం సేకరించాయో.. దానికి మాత్రమే వాడాలి. ఆ తర్వాత తప్పకుండా సమాచారాన్ని డిలీట్ చేయాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజల డేటాను సేవ్ చేసుకునేందుకు అవకాశమే లేదు.

First Published:  8 Aug 2023 2:14 AM GMT
Next Story