Telugu Global
National

కర్ణాటకలో ఇంతటి కరువు ఎప్పుడూ చూడలేదు.. - డీకే శివకుమార్

తాగునీటి సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నట్లు డీకే శివకుమార్ చెప్పారు. తాగునీటి సమస్యను తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ రూమ్ లను, ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

కర్ణాటకలో ఇంతటి కరువు ఎప్పుడూ చూడలేదు.. - డీకే శివకుమార్
X

కర్ణాటకలో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడ్డ సంగతి తెలిసిందే. గతేడాదితో పాటు ఈ ఏడాది కూడా ఆశించిన స్థాయిలో ఆ రాష్ట్రంలో వర్షాలు కురవలేదు. ఈ కారణంగా పలు ప్రాజెక్టుల్లో నీటిమట్టాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఈ పరిస్థితుల్లో కర్ణాటక రాష్ట్రంలో నీటి సంక్షోభం తలెత్తింది. ముఖ్యంగా ఆ రాష్ట్ర రాజధాని బెంగళూరులో తాగునీటి సమస్య తీవ్రమైంది. ఈ నేపథ్యంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తమ రాష్ట్రంలో నెలకొన్న కరువుపై తాజాగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

కర్ణాటక రాష్ట్రంలో మూడు నాలుగు దశాబ్దాల్లో ఇంతటి తీవ్రమైన కరువును ఎప్పుడూ చూడలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితుల్లో తమిళనాడు రాష్ట్రానికి ఎట్టి పరిస్థితుల్లోనూ కావేరి నదీ జలాలను విడుదల చేయలేమని తేల్చి చెప్పారు. వర్షాలు కురవక పోవడంతో బెంగళూరులో ఉన్న 13,900 బోర్లలో 6,900 బోర్లు పూర్తిగా ఎండిపోయినట్లు తెలిపారు. బెంగళూరు అర్బన్ జిల్లాలోని 1,193 వార్డులతోపాటు, రాష్ట్రవ్యాప్తంగా 7,082 గ్రామాలు తాగునీటి ఎద్దడి ఎదుర్కొంటున్నట్లు చెప్పారు.

తాగునీటి సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నట్లు డీకే శివకుమార్ చెప్పారు. తాగునీటి సమస్యను తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ రూమ్ లను, ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

కాగా, కావేరి నదీ జలాలను పంచుకునే విషయంలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య ఎన్నో ఏళ్లుగా వివాదం ఉంది. న్యాయబద్ధంగా తమకు రావాల్సిన నీటి వాటాను కర్ణాటక తమకు అందించడం లేదని తమిళనాడు కొన్నేళ్లుగా ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో తమిళనాడుకు కావేరి నదీ జలాలను విడుదల చేయలేమని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు వ్యాప్తంగా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

First Published:  11 March 2024 8:37 PM IST
Next Story