Telugu Global
National

అదానీ ఎఫ్‌పిఒలో పెట్టుబడులు పెట్టాలని ఓ మంత్రి పెట్టుబడిదారులకు ఫోన్లు చేసింది నిజం కాదా ? -కాంగ్రెస్ ప్రశ్న‌

అదానీ ఎఫ్‌పిఓలో పెట్టుబడులు పెట్టేందుకు మదుపుదారులు వెనకడుగువేయగా, కేంద్రం ప్రభుత్వం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ పెన్షన్ ఫండ్, ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలతో పెట్టుబడులు పెట్టించలేదా? అని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ప్రశ్నించారు.

అదానీ ఎఫ్‌పిఒలో పెట్టుబడులు పెట్టాలని ఓ మంత్రి పెట్టుబడిదారులకు ఫోన్లు చేసింది నిజం కాదా ? -కాంగ్రెస్ ప్రశ్న‌
X

అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఎఫ్‌పిఒలో పెట్టుబడులు పెట్టాలని బీమా సంస్థ ఎల్‌ఐసి, భారతీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ)ని ఆదేశించారా? అని కాంగ్రెస్ బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక వల్ల దిగజారిన అదానీ గ్రూపు కంపెనీలను బైటపడేయడం కోసం కేంద్రం పని చేయలేదా అని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ప్రశ్నించారు. అదానీ ఎఫ్‌పిఓలో పెట్టుబడులు పెట్టేందుకు మదుపుదారులు వెనకడుగువేయగా కేంద్రం ప్రభుత్వం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ పెన్షన్ ఫండ్, ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలతో పెట్టుబడులు పెట్టించలేదా? అని ఆయన అడిగారు

''అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఎఫ్‌పీవోలో ఎల్‌ఐసీ రూ. 299 కోట్లు, ఎస్బీఐ ఎంప్లాయీస్‌ పెన్షన్‌ ఫండ్‌ రూ.99 కోట్లు, ఎస్బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ వంటిప్రభుత్వ రంగ సంస్థలు రూ.125 కోట్లకు బిడ్‌ వేశాయి. అదానీ గ్రూపును బయటపడేసేందుకు ప్రభుత్వరంగ సంస్థల్లోని ప్రజాధనాన్ని మరోసారి పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టాలని ఆదేశాలు జారీ చేస్తారా?'' అని రమేశ్‌ నిలదీశారు.

“ఒక‌ కేంద్ర మంత్రి గౌతమ్ అదానీ తరపున ఐదు-ఆరుగురు ప్రముఖ‌ వ్యాపారవేత్తలకు వ్యక్తిగత కాల్‌లు చేసి పెట్టుబడులు పెట్టమని కోరింది నిజమేనా? గౌతమ్‌భాయ్‌ని ఇబ్బంది పడకుండా రక్షించడానికి FPOలో వారి వ్యక్తిగత నిధులు పెట్టుబడులు పెట్టించారా? పెట్టుబడిదారులకు డబ్బు తిరిగి వస్తుందని హామీ ఇచ్చారా '' అని జైరాం రమేష్ ప్రశ్నించారు.

అదానీ ప్రతిష్ఠను కాపాడేందుకు, బలవంతంగా వారితో పెట్టుబడులు పెట్టించారని.. ఆ తర్వాత అదానీ ఎఫ్‌పీవోను రద్దుచేసి, ఇన్వెస్టర్ల డబ్బు తిరిగి చెల్లించారని రమేష్ గుర్తుచేశారు.

"ఈ సంబంధిత సమాచారాన్ని చాలా మంది మదుపుదారుల నుండి దాచిపెట్టి, ఎంపిక చేసిన కొద్దిమందితో మాత్రమే ఈ సమాచారాన్ని పంచుకోవడం భారతీయ సెక్యూరిటీ నిబంధనలను ఉల్లంఘించడం కాదా? ఈ విధంగా FPO పెట్టుబడిదారులను మోసగించడం నైతికమేనా" అని ఆయన ప్రశ్నించారు.

First Published:  20 Feb 2023 8:01 AM IST
Next Story