Telugu Global
National

దేశంలో ఎన్నడూ చూడని నియంతృత్వ పాలన -బీజేపీపై కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు

దేశంలో ఎప్పుడూ చూడని విధంగా నియంతృత్వ పాలన కొనసాగుతోందని, ప్రత్యర్థులందరినీ ఇలా జైల్లో పెట్టడం గతంలో ఎప్పుడూ చూడలేదని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.

దేశంలో ఎన్నడూ చూడని నియంతృత్వ పాలన -బీజేపీపై కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు
X

గడిచిన 75 ఏళ్ల కాలంలో దేశంలో ఎన్నడూ చూడని నియంత్రత్వ పాలన సాగుతోందని ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం అమృత్‌సర్‌లో పంజాబ్ ఆప్ కార్యకర్తలు, పార్టీ నాయకులతో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న కేజ్రీవాల్ మాట్లాడుతూ బీజేపీ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు.

దేశంలో ఎప్పుడూ చూడని విధంగా నియంతృత్వ పాలన కొనసాగుతోందని, ప్రత్యర్థులందరినీ ఇలా జైల్లో పెట్టడం గతంలో ఎప్పుడూ చూడలేదని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. తనను, తన పార్టీకి చెందిన మనీష్ సిసోడియాను జైలుకు పంపారన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన బ్యాంక్ ఖాతాను అటాచ్ చేశారని మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్లో టీఎంసీని ఇబ్బందులు పెడుతున్నారని, తమిళనాడులో స్టాలిన్ కేబినెట్‌లోని మంత్రులను జైలుకు పంపారని కేజ్రీవాల్ విమర్శించారు.

దేశంలోని ప్రత్యర్థి పార్టీకి చెందిన నాయకులందరినీ జైల్లో పెట్టాలని, అప్పుడు ఒకే పార్టీ, ఒకే నాయకుడు మిగిలిపోతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం మనుగడకే ప్రమాదం వాటిల్లిందని, ఇలా జరగనివ్వకూడదని కేజ్రీవాల్ అన్నారు. ఈ సందర్భంగా దేశంలో ఉన్న పరిస్థితిని రష్యాతో పోలుస్తూ కేజ్రీవాల్ మాట్లాడారు.

రష్యాలో పుతిన్ తన ప్రత్యర్థి పార్టీలకు చెందిన నాయకులందరినీ జైలుకు పంపడమో లేదా వారిని చంపడమో చేశారని చెప్పారు. ఆ పై ఎన్నికలు నిర్వహించి 87 శాతం ఓట్లు సాధించారన్నారు. ఇక్కడ కూడా ప్రతిపక్షమే లేకుండా చేస్తే ఇక వచ్చే ఓట్లన్నీ మీకేనంటూ.. బీజేపీ పాలనపై కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన కేజ్రీవాల్ కొంతకాలంగా జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడంతో ప్రస్తుతం ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.

First Published:  17 May 2024 6:45 PM IST
Next Story